కొంతకాలం సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు. అదే విధంగా తమిళ స్టార్ డైరెక్టర్ సినిమా రీమేక్ చేసిన ఓ టాలీవుడ్ డైరెక్టర్.. ఆ తమిళ స్టార్ డైరెక్టర్ లానే తయారయ్యాడేమో అనిపిస్తుంది. అతనే శ్రీకాంత్ అడ్డాల. ‘కొత్త బంగారు లోకం’ ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ వంటి చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. ఫ్యామిలీ స్టోరీస్ తీయడంలో సిద్ధహస్తుడు. కానీ ‘బ్రహ్మోత్సవం’ సినిమా రిజల్ట్ అతని కాన్ఫిడెన్స్ కి పూర్తిగా దెబ్బ తీసిందని చెప్పాలి.
ఆ సినిమా వల్ల శ్రీకాంత్ అడ్డాలకి అవకాశాలు లేకుండా పోయాయి. ఈ క్రమంలో వెంకటేష్- సురేష్ బాబు.. లు అతనికి ‘నారప్ప’ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ కి అది రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఒరిజినల్ తో పోల్చుకుంటే రీమేక్లో అతను చేసిన మార్పులు అంటూ ఏమీ లేవు. అయినప్పటికీ దర్శకుడు వెట్రిమారన్ స్టైల్ ను శ్రీకాంత్ అడ్డాల బాగా ఓన్ చేసుకున్నట్టు స్పష్టమవుతుంది.
ఎందుకంటే తాజాగా ‘పెద కాపు -1 ‘ కి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఇది ఒక పీరియాడికల్ మూవీ. 1980 లలో గ్రామీణ రాజకీయాలు, కులాల గొడవలు.. వంటివి ఈ టీజర్లో చూపించారు. విజువల్స్ అన్నీ శ్రీకాంత్ అడ్డాల తీసిన సినిమాలకి దూరంగా.. వెట్రిమారన్ తీసే సినిమాలకి దగ్గరగా ఉన్నాయనే భావన అందరికీ కలిగింది.
శ్రీకాంత్ అడ్డాల తీసే ప్రతి సినిమాలోనూ కనిపించే రావు రమేష్ ఈ చిత్రం టీజర్లో కనిపించాడు. అతని సినిమాలకి రెగ్యులర్ గా పనిచేసే మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతని బంధువు విరాట్ కర్ణ ‘పెద కాపు 1 ‘ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.