Srikanth Odhela: శ్రీకాంత్ ఓదేల్ ను స్కూల్లో ఏ పేరుతో పిలిచేవారో తెలుసా..?

‘విజేతలెప్పుడూ ఒంటరివాళ్ళు’ అంటారు నేటి వ్యక్తిత్వ వికాస నిపుణులు కొందరు! ఆ ఒంటరితనానికి భయపడో ఏమో విద్యార్థిగా విజయాలకి దూరమై స్నేహితులకి చేరువయ్యాడు శ్రీకాంత్‌ ఓదెల. మొద్దబ్బాయిగా ముద్రపడ్డాడు… ఆరేడు స్కూళ్ళు మారాడు. చివరికి సినిమాలే జీవితమనుకుని దర్శకుడై ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్‌నిచ్చాడు. ఆ ప్రయాణమంతటా అండగా నిలిచారు అతని స్నేహితులు. అందుకేనేమో శ్రీకాంత్‌ తన కథ చెబుతుంటే పదేపదే ‘దసరా’ కథానాయకుడు ‘ధరణి’ గుర్తుకొస్తుంటాడు. పరీక్షల సీజన్‌ కదా… ఆ మధ్య వాట్సాప్‌లో టీచర్‌ ఒకరు పంపిన ఓ సందేశం వైరలై నాకూ వచ్చింది. ‘పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకునే పిల్లల్లో ఓ కళాకారుడు ఉండొచ్చు… అతనికి లెక్కలు అవసరం లేదు. ఓ పారిశ్రామికవేత్త ఉండొచ్చు… సాంఘికశాస్త్రం మార్కులతో అతనికి పనిలేదు…’ ఇలా సాగుతుందా మెసేజ్‌. అది చదివాక ఆనందంతోపాటూ బాధా కలిగింది.

ఓ పదిహేనేళ్ళకిందట మన సమాజంలో ఇలాంటి స్పృహే ఉండుంటే మా టీచర్లు నన్ను తిట్టి ఉండేవారు కాదుకదా అనిపించింది. చిన్నప్పటి నుంచీ నాకు స్కూలు అన్నది ఓ ఫోబియా… అక్కడ నన్ను నాలుగ్గోడల మధ్య బంధించినట్టు అనిపించేది. తొలిసారి బడిలో చేరిన పిల్లలందరికీ అలాగే ఉంటుందికానీ… ఆ సమస్య నాకు తర్వాతా కొనసాగింది. క్లాసులో కూర్చున్నంత సేపూ కిటికీ బయటకి చూడటం అలవాటైపోయింది. టీచర్లు చెప్పేది బుర్రకెక్కేది కాదు. తన్నులూ తిట్లూ మామూలైపోయాయి. అలా పదో తరగతికి వచ్చేనాటికే ఆరేడు స్కూళ్ళు మారాల్సి వచ్చింది. ఏ స్కూల్లో చేరినా… బ్యాక్‌ బెంచిలో… కిటికీ దగ్గరగా అతి నిశ్శబ్దంగా ఉండిపోయేవాణ్ణి. ప్రతి సబ్జెక్టులోనూ సున్నా మార్కులు తెచ్చుకునేవాణ్ణి. ‘మీవాడు ఇన్ని స్కూళ్లు మారుతున్నాడేమిటీ?’ అనే బంధువులూ స్నేహితుల మధ్య అమ్మానాన్నల్ని తలెత్తుకోలేకుండా చేశాను. ఈ పరిస్థితులన్నింటా నాకు ఊరటనిచ్చింది… నా స్నేహితులే! ఓ మొద్దబ్బాయికి అలాంటివాళ్ళే మిత్రులవుతారని భావిస్తారేమో…

వాళ్ళలో టాపర్సూ ఉన్నారు. ఆ స్నేహప్రపంచం గురించి చెప్పడానికి ముందు… మాది గోదావరిఖని. నాన్న చంద్రయ్య సింగరేణిలో డ్రైవర్‌గా ఉండేవారు. ఇంట్లో నేనూ, తమ్ముడూ ఇద్దరమేకానీ, మా నాన్నకి ముగ్గురు అన్నదమ్ములూ, ఓ చెల్లెలూ. తాతయ్య కి చిన్నప్పుడే ఓ ప్రమాదంలో కాళ్లు పోయాయి. దాంతో నాన్న తన చిరుద్యోగంతోనే వాళ్ళందరూ స్థిరపడేలా చూశాడు. బాబాయిలూ, అత్తయ్యలందరూ మా చుట్టుపక్కల ఇళ్ళలోనే ఉండేవారు. ఇళ్ళు వేరయినా… ఉమ్మడికుటుంబంలాగే కలిసిపోయేవారు. వాళ్ళ పిల్లలతోపాటే మేమూ పెరిగాము. చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాలుపడ్డ కార్మిక కుటుంబం కాబట్టి… పిల్లలనైనా బాగా చదివించి అత్యున్నత స్థానాల్లో చూడాలన్న తపన నాన్నతోపాటూ బాబాయిలందరిలోనూ ఉండేది. అటు బాబాయిల పిల్లలూ, ఇటు మా తమ్ముడూ అందరూ ఆ తపనని అందిపుచ్చుకున్నారు.

కష్టపడి చదివి టాపర్‌లుగా రాణిస్తుండేవారు… ఒక్క నేను తప్ప! ర్యాంకుల మాట దేవుడెరుగు కనీసం పాస్‌మార్కులూ వచ్చేవి కాదు నాకు. కానీ – నేను ఎన్ని స్కూళ్లు మారానో అంతమంది జిగిరీ దోస్తుల్ని సంపాదించుకోగలిగాను. ఎల్‌కేజీలో తొలిసారి పరిచయమైన శివ, మిగతా స్కూళ్లలో పరిచయమైన ప్రణీత్, సిద్ధూ, కృష్ణ, విశాల్, ముస్తఫా, అశ్వక్… అందరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం! చుట్టుపక్కలవాళ్ళందరూ ‘నువ్వెందుకూ పనికిరావు’ అంటున్నా సరే… వాళ్ళు పక్కన ఉంటే ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చేది నాకు. ఆ స్నేహితులే నేను ఏడో తరగతి డిమ్కీ కొట్టకుండా చూసుకున్నారు. ప్రశ్న-జవాబులు నాచేత బాగా బట్టీపట్టించారు… స్పీడ్‌గా రాయడం ప్రాక్టీస్‌ చేయించారు. అలా నాకు పరిచయమైన రాత… ఎనిమిదో తరగతిలో ఓ అందమైన మలుపు తీసుకుంది…

(Srikanth Odhela) నాకు ప్రతి సబ్జెక్టూ భయమే కానీ… హిందీ అంటే ఇంకా భయం. ఆ బెదురుతో నిద్ర ముంచుకొచ్చేది. కునికిపాట్లు పడితే కొడతారని… నోట్‌పుస్తకంలో ఏదో ఒకటి రాయడం మొదలుపెట్టాను. కొన్నాళ్ళకి అవే కథలుగా మారాయి. గోదావరిఖనికి మూడు కిలోమీటర్ల దూరంలో మా నాన్నమ్మవాళ్ళ ఊరు వీర్లపల్లి ఉండేది. వారాంతంలో నేనూ మా దోస్తులం అక్కడికి వెళ్ళి ఆట్లాడుకునేవాళ్ళం. ఆ ఊరిని నేపథ్యంగా తీసుకునే… నాకు ఊహకందినంత వరకు తొలి కథ రాశాను. మొదట మా స్నేహితులకే వినిపించాను. వాళ్ళు బావుందని చెప్పడంతో… అప్పటి నుంచి హిందీ క్లాసులో ఏదో ఒకటి రాయడం ప్రారంభించాను. మా చివరి బాబాయి చిన్నప్పుడు రైళ్ళలో వచ్చే బొగ్గుని దొంగతనం చేసేవారట. నేనే ఆ ‘సాహసాలు’ చేసినట్టు ఊహించుకుని కథలు రాశాను.

అప్పటికే మిత్రులం కలిసి సినిమాలకి వెళ్ళడం ప్రారంభించాం. వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ‘నీలాగ కథలు రాసేవారే డైరెక్టర్‌లవుతారు’ అన్నారు నా మిత్రులు! వాళ్ళు ఏ ముహూర్తాన అన్నారోకానీ ఆ మాట నాలో బలంగా నాటుకుపోయింది. సినిమా డైరెక్టర్‌ని కావాలన్నదే నా లక్ష్యమైంది. ఈలోపు పదో తరగతి పరీక్షలొచ్చాయి. బొటాబొటీ మార్కులతో పాసయ్యాను. కానీ, పాసయ్యానన్న ఆనందం అట్టే మిగల్లేదు నాకు… ఇంటర్‌కి నన్ను హైదరాబాద్‌లో ఓ రెసిడెన్షియల్‌ కాలేజీలో చేర్చాడు నాన్న… అలాగైనా నేను బాగా చదువుతానేమో అని. కానీ నేను నా మిత్రులు దూరం కావడంతో క్లాసుల్లో ఇదివరకటికంటే నిర్లిప్తంగా మారాను. ఇక్కడా పాత కథే… టీచర్లందరూ నన్ను తిట్టినవాళ్ళే. ఒక్క శేషు మాస్టారే ఇందుకు మినహాయింపు.

ఆయన ఓ రోజు నాలాంటి వాళ్ళందరినీ పిలిచి ‘ఎందుకు చదవట్లేదు?’ అని అడిగారు. ‘నాకు చదువంటే ఇష్టం లేదు సార్‌! సినిమా డైరెక్టర్‌ని అవుతాను’ అన్నాను. ఇంకెవరయినా అయితే చెంప చెళ్ళుమనిపించేవారు కానీ ఆయన ‘గుడ్‌… ఇంత ధైర్యంగా చెబుతున్నావంటే నువ్‌ తప్పకుండా అవుతావ్‌!’ అన్నారు. నా జీవితంలో ఓ టీచరు నన్ను మెచ్చుకోవడం అదే మొదటిసారి! అప్పటి నుంచీ ఆయన నాతో సినిమాల గురించి మాట్లాడసాగారు. అలా చెబుతూనే… మెల్లగా నన్ను చదువుపైన దృష్టి సారించేలా చేశారు. అప్పుడోసారి సుకుమార్‌గారి ‘జగడం’ సినిమా చూశాను. ఆ విషయం యథాలాపంగా శేషు మాస్టారితో చెబితే ‘సుకుమార్‌ నా పాత మిత్రుడు’ అన్నారు. ఇంకేం- ఇంటర్‌ కాగానే ఆయన సిఫార్సుతో సుకుమార్‌ దగ్గర చేరిపోవచ్చని కలలు కన్నాను.

నాలుగేళ్ళు పడిగాపులు… ఇంటర్‌ పూర్తయింది. ‘తర్వాత ఏం చేస్తావు?’ అన్నారు నాన్న. ‘నేను సినిమాల్లోకి వెళతాను నాన్నా!’ అన్నాను. కోపంతో ఊగిపోతారనుకున్నాను కానీ చాలా ప్రశాంతంగా ‘నీ ఇష్టం… ఏదైనా మనసుపెట్టి చెయ్‌’ అని వెళ్ళిపోయారు! ఆయన ఆ మాట అనడమే గొప్ప ఆశీస్సుగా అనిపించింది ఆ క్షణాన. అప్పటి నుంచి… నా బాధ్యత మొత్తం స్నేహితులే తీసుకున్నారు. అప్పటికే నా గోదావరిఖని మిత్రులు హైదరాబాద్‌లో బీటెక్‌ చేస్తూ నా రూముకే వచ్చేశారు. నాకన్నా వాళ్ళే నన్ను ఎక్కువగా నమ్మారు. నాకు తోచిన కథలన్నీ రాయమన్నారు. నా రాతకి అంతరాయం ఏర్పడుతుందని… వంటావార్పులూ వాళ్ళే చూసుకునేవారు. అలా కథలు రాసుకుని… సుకుమార్‌గారి ఆఫీసు గేటు దగ్గర పడిగాపులు మొదలుపెట్టాను.

రోజులూ నెలలూ కాదు నాలుగేళ్ళు..! ఆ తర్వాతే ఆయన కంట్లో పడ్డానేమో నన్ను పిలిచి ‘నీది చాలా చిన్నవయసు. ఏదైనా ఉద్యోగంలో కుదురుకో… సినిమాలొద్దు’ అన్నారు. నేను వినకుండా తర్వాతి రోజూ వెళితే ‘నీలాంటివాళ్లు ఎంతోమంది వచ్చి నా దగ్గరే ఉండిపోతున్నారు… కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోతున్నా’ అన్నారు విసుగ్గా. ‘నేను మీ దగ్గర రెండు సినిమాలకంటే చేయను సార్‌! ఇబ్బంది పెట్టను’ అన్నాను. ‘సరే’ అన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో ‘అప్రెంటిస్‌’గా చేరాను. అప్రెంటిస్‌నే అయినా… టైటిల్స్‌లో నా పేరు వేశారు. ఐదు క్షణాలే వస్తుందది. అయితేనేం – నా పేరుని వెండితెరపైన చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు అటు నా స్నేహితులూ ఇటు మా అమ్మానాన్నలు! ఆ తర్వాత ‘రంగస్థలం’ మొదలైంది.

ఆ సినిమా కాస్ట్యూమ్స్‌ బాధ్యతల్ని సుకుమార్‌గారు నాకు అప్పగించారు. షూటింగ్‌కి ఆరు నెలల ముందు నుంచే ఆరుగురు కాస్ట్యూమ్‌ డిజైనర్‌లతో కోఆర్డినేట్‌ చేసి నాకేం కావాలో చెప్పసాగాను. షూటింగ్‌ స్పాట్‌లో వెయ్యిమంది ఉన్నా… ప్రతి కాస్ట్యూమ్‌ ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. చిన్న తేడా వచ్చినా రీషూట్‌ చేయాలని పేచీ పెట్టసాగాను. ఆ మొండితనానికి సుకుమార్‌గారూ కాస్త చిరాకుపడ్డ మాట వాస్తవమే కానీ… ప్రి-రిలీజ్‌ ఈవెంట్‌లో నన్ను వేదికపైకి పిలిచి మరీ అందరి ముందూ అభినందించారు. నా పేరుని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కాకుండా ‘అసోసియేట్‌’గా టైటిల్స్‌లో వేయించారు. సినిమా విడుదలయ్యాక సుకుమార్‌గారికి హామీ ఇచ్చినట్టే బయటకొచ్చేశాను.. ఈలోపు నా ఫ్రెండ్స్‌ బీటెక్‌ ముగించి ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించారు.

వాళ్లతోపాటు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోహిత్‌, శ్రావణ్‌, శ్రీనాథ్‌లు స్నేహితులయ్యారు. అంతే కాదు- సందీప్, రమేష్ అనే కొత్త మిత్రులూ హరి అనే మరో సీనియర్ కూడా మా గ్యాంగ్‌లో భాగమయ్యారు. అందరం కలిసి పదిమందిమయ్యాం! దాంతో- ఓ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ తీసుకుని ఉండసాగాం. అప్పుడప్పుడూ మా ఫ్లాట్‌కి వచ్చే నా సినిమా మిత్రులు నన్ను ఏదో యథాలాపంగా అడిగినట్టు ‘మీ రూమ్మేట్స్‌ ఏమిట్లు?’ అనేవాళ్ళు. మొదట్లో వాళ్ళేమి అడుగుతున్నారో తెలిసేది కానీ… పోనుపోను అర్థమై చాలా కోపం వచ్చేది. ‘సమాజం ఈకాలంలోనూ కులాల గురించి ఎందుకు ఆలోచిస్తోంది..?’ అన్న ప్రశ్నతోనే ‘దసరా’ సినిమా కథ రాసుకున్నాను. నాకు పరిచయమున్న నిర్మాత సుధాకర్‌ చెరుకూరికి కథ వినిపించాను.

ఆయన నానీని కలవమన్నారు. నానీగారు ఓకే అనడమే కాదు… కీర్తిసురేశ్‌ చేతా ఓకే చేయించారు. ఈలోపు నాన్నకి కరోనా వచ్చి… 20 రోజులపాటు వెంటిలేటర్‌లో పెట్టారు! అటు స్నేహితులూ, ఇటు మా నిర్మాతా కలిసి ఆయన ప్రాణాన్ని కాపాడారు. ఈ సంక్షోభం తర్వాతే ‘దసరా’ మొదలైంది. సినిమాలో హీరోకన్నా వీర్లపల్లి నేపథ్యానికీ కథలకే ప్రాధాన్యం ఉంది కాబట్టి… మిక్స్‌డ్‌ టాక్‌ వస్తుందనుకున్నాను. కానీ, వారం తిరక్కుండానే వందకోట్ల రూపాయలు దాటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది..

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus