శ్రీరస్తు శుభమస్తు

  • August 5, 2016 / 08:15 AM IST

‘కొత్తజంట’ సినిమా తరువాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. అందుకే ‘సోలో’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందించిన పరశురామ్ దర్శకత్వంలో ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే చిత్రంలో నటించాడు. అల్లు శిరీష్ ఇప్పటికి రెండు చిత్రాల్లో నటించినా.. అందులో ఒక్కటి కూడా మంచి హిట్ ను ఇవ్వలేకపోయింది. మరి ఈ సినిమా అయినా.. శిరీష్ కు మంచి సక్సెస్ ను ఇచ్చిందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ : సంపన్న కుటుంబానికి చెందిన శిరీష్(అల్లు శిరీష్), అనన్య అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అనన్య వైజాగ్ లో ఇంజనీరింగ్ చదువుకుంటుందని తెలిసి తన ప్రేమను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అనన్య ఓ మద్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తండ్రి జగన్నాథం(రావు రమేష్) అంటే అనన్యకు ప్రాణం. శిరీష్ తండ్రి చ్ణద్రమోహన్(ప్రకాష్ రాజ్)కు మాత్రం డబ్బుందనే గర్వం. మిడిల్ క్లాస్ వాళ్ళను అస్సలు యాక్సెప్ట్ చేయడు. శిరీష్ తను ప్రేమించేది ఓ మిడిల్ క్లాస్ అమ్మాయినే అని తండ్రికి చెబుతాడు. దీంతో ఆయన శిరీష్ తో ఓ ఛాలెంజ్ చేస్తాడు. దానికి శిరీష్ ఒప్పుకుంటాడు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి..? శిరీష్ ను అనన్య ప్రేమిస్తుందా..? లేక తండ్రి మాటతో అనన్య వేరే వాళ్ళను పెళ్లి చేసుకొని వెళ్లిపోతుందా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల పెర్ఫార్మన్స్ : గత చిత్రాలతో పోలిస్తే అల్లు శిరీష్ తన నటనలో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కామెడీ టైమింగ్ కూడా బావుంది. పెద్దగా డాన్సులు చేయకపోయినా.. ఉన్నంతలో ఓకే అనిపించాడు. తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం పడే తాపత్రయం, తను ఇంక దక్కదేమో.. అని బాధ పడే సన్నివేశాల్లో ఎమోషన్స్ బానే పండించాడు. కొన్ని చోట్ల అల్లు అర్జున్ ను ఇమిటేట్ చేశాడనే చెప్పాలి. ఇక కాలేజ్ కు వెళ్ళే అమ్మాయి పాత్రలో లావణ్య ఒదిగిపోయింది. స్క్రీన్ పై చాలా అందంగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించింది. తండ్రి పాత్రలో రావు రమేష్ నటన సెటిల్డ్ గా ఉంటుంది. ప్రకాష్ రాజ్ పాత్ర సినిమా మొత్తం ఉండకపోయినా.. కనిపించే నాలుగైదు సన్నివేశాల్లో తనదైన రీతిలో నటించారు. అలీ, శిరీష్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. తనికెళ్ళ భరణి, రణధీర్, సుమలత, ప్రగతి వాళ్ళ పాత్రల పరిధుల్లో చక్కగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు : పరశురామ్ అనుకున్న కథను ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రం గతంలో పరశురామ్ చేసిన ‘సోలో’ చిత్రం మాదిరి అనిపించినా.. కథనంలో కొత్తదనం ఉండడం వలన ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారు. ఫోటోగ్రఫి చాలా చోట్ల బ్రైట్ గా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాల్లో డి.ఐ సరిగ్గా చేయలేకపోయారు. తమన్ అందించిన మూడు పాటలు బాగానే ఉన్నాయి. సిట్యుయేషన్ కు తగ్గట్లుగా పాటలు ఉంటాయి. నేపధ్య సంగీతం కూడా ఓకే అనిపిస్తుంది. ప్రేక్షకులను విసుగు తెప్పించేలా సాగతీయకుండా.. సీన్ టు సీన్ ఎడిటింగ్ బావుంటుంది. భారీ లొకేషన్స్, సెట్స్ లో కాకుండా సింపుల్ గా ఉన్నంతలో సినిమాను బాగానే చిత్రీకరించారు. నిర్మాణ విలువలు బావున్నాయి.

విశ్లేషణ : ఒక అబ్బాయి, అమ్మాయిని ప్రేమించడం. తన ప్రేమ కోసం తిరగడం ఇలాంటి కాన్సెప్ట్ తో వందల కొద్దీ సినిమాలు వచ్చాయి. కానీ వాటిల్లో ఈ సినిమా ప్రత్యేకం. ఓ ప్రేమ కథకు హ్యూమన్ డ్రామాను యాడ్ చేసి చిన్న కాన్ఫ్లిక్ట్ తో సినిమాను చక్క్గగా రూపొందించారు. ప్రేమ ఎపిసోడ్ కూడా బోర్ కొట్టించకుండా యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. చిన్న ట్విస్ట్ తో ఇంటర్వల్ ముగుస్తుంది. రెండో భాగం మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడుస్తుంటుంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. కుటుంబంతో సహా చూడగలిగే చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీరస్తు శుభమస్తు’.

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus