దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి 24 క్రాఫ్ట్స్ పైన మంచి పట్టుంది. అంతేకాదు టెక్నీకల్ గాను అవగాహన ఉంది. అందుకే రాజమౌళి తన సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంటారు. అయితే దీనికి ఎక్కువ సమయం పడుతోంది. ఏళ్ళ తరబడి అభిమానులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ ఎదురుచూపుని తగ్గించడానికి ఈ సారి గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీస్తానని బాహుబలి సినిమా రిలీజ్ సమయంలో జక్కన్న చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే సినిమా తీయాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో మల్టీస్టారర్ సినిమాని ప్లాన్ చేశారు. తాజాగా ఇందులోనూ గ్రాఫిక్స్ ఉంటాయని తెలిసింది.
బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొన్ని చోట్ల గ్రాఫిక్స్ వాడుతున్నట్లు సమాచారం. అవి కూడా లేకుంటే తన అభిమానులు నిరాశపడుతున్నారని జక్కన్న ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ప్రస్తుతం చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం పూర్తి చేసి బోయపాటి శ్రీను తో సినిమా చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ మల్టీస్టారర్ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.