రాజమౌళి (S. S. Rajamouli) సినిమాలు అంటే కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉండాల్సిందే అనే భావన అందరిలో ఉంది. బాహుబలి నుంచి RRR (RRR) వరకు, ఆయన రూపొందించిన ప్రతీ సినిమా వర్కింగ్ టైమ్ ఎక్కువే. మహేష్ బాబుతో (Mahesh Babu) చేస్తున్న SSMB 29 కూడా అదే పంథాలో ఉండబోతుందనుకున్నారు. కానీ ఈసారి మాత్రం రాజమౌళి అందరినీ ఆశ్చర్యపరచే విధంగా ప్లాన్ మార్చేశాడట. ఈ సినిమా 2026 మధ్యలోనే రిలీజ్ అవుతుందనే సంకేతాలు బయటకొచ్చాయి.
ఇదే విషయాన్ని రాజమౌళి టీమ్ లోని వ్యక్తులు కూడా స్పష్టంగా చెబుతున్నారు. గతంలో బాహుబలి సినిమా ఒక్కసారిగా రెండు భాగాలుగా మారిపోవడం, RRR షూటింగ్ సమయంలో అనేక సమస్యలు ఎదురుకావడం వల్ల ఆలస్యం అయ్యాయి. కానీ SSMB29 విషయంలో అన్నీ ముందుగానే ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాజమౌళి ముందుకు సాగుతున్నాడట. అందుకే ఈ సినిమా కేవలం ఏడాదిన్నరలోపే పూర్తవుతుందనే టాక్ నడుస్తోంది.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. సెట్స్ పైకి వెళ్లడానికి అన్ని రకాల పనులు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. రాజమౌళి ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీ, విభిన్నమైన షూటింగ్ మెథడ్స్‌ను ప్రయోగించనున్నాడని ఇండస్ట్రీ టాక్. కథ నేపథ్యం అడ్వెంచర్ తో కూడిన ఆసక్తికరమైన యాక్షన్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని, కానీ వీటన్నింటినీ ముందే ప్రీ-ప్లాన్ చేసుకోవడం వల్ల వర్క్ షెడ్యూల్‌లో ఆలస్యం ఉండదని చెబుతున్నారు.
రాజమౌళి స్టైల్‌ను చూస్తే, ఇకపై ఆయన సినిమా చేసేందుకు నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉండబోదన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మహేష్ ఫ్యాన్స్ మాత్రం 2026లోనే సినిమాను చూసే అవకాశం దక్కుతుందంటే ఆనందంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎలాంటి అంచనాలు సెట్ చేస్తుందో చూడాలి.