ప్రముఖ నటుడు రవి కుమార్ (Ravi Kumar) (75) మరణించారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 50 ఏళ్లకు పైగా సినిమా రంగంలో ఉన్న ఆయన మలయాళ, తమిళ భాషల్లో 100కుపైగా సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. కేరళలోని త్రిచ్చూర్‌కు చెందిన రవికుమార్ ‘లక్ష ప్రభు’ (1968) అనే సినిమాతో మలయాళ చిత్రసీమకు తొలుత పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఉల్లాస యాత్ర’ (1975) అనే సినిమాతో హీరోగా మారారు.
ఆ తర్వాత ‘అవర్‌గళ్’ అనే సినిమాతో కోలీవుడ్‌కి వచ్చారు. రవి కుమార్‌కు (Ravi Kumar) 1979లో వచ్చిన ‘పగలిల్ ఒరు ఇరవు’ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ‘యూత్’, ‘రమణ’, ‘శివాజీ’ తదితర సినిమాల్లో నటించి మెప్పించారు. అదే సమయంలో సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించారాయన. రాధిక శరత్‌కుమార్‌కు చెందిన రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్ మీద వచ్చిన ‘పిన్ని’, ‘అక్క’ తదితర సీరియల్స్‌లో ఆయన్ని చూడొచ్చు. తెలుగులో నేరుగా ‘అనుబంధం’ అనే సీరియల్‌లో నటించారు.