తెలుగు సినిమాను గౌరవించుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ఇస్తూ వచ్చేది. అయితే 14 ఏళ్ల క్రితం ఈ పురస్కారాలు అగిపోయాయి. వివిధ కారణాల వల్ల ఆగిన పురస్కారాల కోసం సినిమా పరిశ్రమ చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు. ఇక రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని విడిపోయాక రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అదిగో, ఇదిగో అని గత ప్రభుత్వాలు చెప్పినా జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ‘గద్దర్’ పేరిట పురస్కారాలను (Gaddar Awards) ప్రకటించింది.
తాజాగా ఈ పురస్కారాల (Gaddar Awards) కోసం జ్యూరీని కూడా ఏర్పాటు చేసింది. త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకి పరిశ్రమ నుంచి విశేష స్పందన వచ్చిందన రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి) ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమాల లెక్క తేల్చి పురస్కారాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన జ్యూరీకి ప్రముఖ నటి జయసుధను (Jayasudha) ఛైర్మన్‌గా నియమించినట్లు కూడా చెప్పారు.
14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ అవార్డుల ఎంపిక కోసం నిష్ణాతులతో జ్యూరీని నియమించినట్టు కూడా చెప్పారు. ఈ జ్యూరీలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. ఈ నెల 21 నుంచి సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ మొదలుకానుంది. పురస్కారాల కోసం అన్ని కేటగిరీలకి కలిపి 1,248 నామినేషన్లు వచ్చాయి. తెలుగు చలన చిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించేలా పురస్కారాల ఎంపిక ప్రక్రియ ఉంటుందని దిల్ రాజు కూడా చెప్పారు.
వ్యక్తిగత విభాగంలో 1,172 నామినేషన్లు రాగా.. ఫీచర్ ఫిల్మ్, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాల విభాగాల్లో మొత్తంగా 76 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ లెక్క తేలితే అవార్డుల ప్రకటన, బహూకరణ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం పనులు వేగం చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏమన్నా ఈ దిశగా ఆలోచిస్తుందేమో చూడాలి.