ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్‌లో ఓ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ కుకింగ్ పాఠశాలలో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేసి శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఈ ఘటనలో వెంటనే స్పందించిన కొంతమంది కార్మికులకు ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది.
ఏప్రిల్ 8న సింగపూర్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ పక్కనే ఉన్న మరో భవనంలో కొంతమంది భారతీయు వలస కార్మికులు పని చేస్తున్నారు. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే వెళ్లి సాహసం చేసే పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు. అందుకుగాను ఇటీవల వారిని సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. ‘లైఫ్ సేవర్’ అవార్డును ప్రదానం చేసింది. ప్రాణాలు పణంగాపెట్టి పిల్లలను రక్షించినందుకు ఈ అవార్డును ఇస్తున్నట్లు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.
ఈ ప్రమాదం గురించి ఆ కార్మికులు మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఆ విషయాలు కూడా ఇప్పుడు వైరల్‌గా మారాయి. మేము ప్రమాద స్థలం దగ్గరకు వచ్చి చూసేసరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతూ, అరుస్తూ కనిపించారు. మూడో అంతస్తు నుండి కొంతమంది పిల్లలు దూకేయాలని చూస్తున్నారు. ముందుగా వారిని కిందకు తీసుకొచ్చాము. ఆ తర్వాత అందరినీ కిందకు తీసుకొచ్చాం అని తెలిపారు.
ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని, ఆమెను కాపాడలేకపోయినందుకు బాధపడుతున్నామని ఆ కార్మికులు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్‌లోని ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. అందులో మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. ఆస్పత్రిలో వైద్యంతో కాస్త కోలుకున్నాక ఇటీవల చిన్నారిని పవన్ – అనా లెజినోవా హైదరాబాద్‌కు తీసుకొచ్చేశారు.