ప్రముఖ హాలీవుడ్ నటి చాలా ఏళ్లపాటు దెయ్యాలతో కలిసి జీవించానని.. చివరకు ఒకరోజు వాటిని తరిమే వ్యక్తిని తీసుకొచ్చి దెయ్యాల గోల నుంచి విముక్తి పొందానని తెలిపారు. సామాన్యులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే పెద్దగా పట్టించుకోము కానీ ఏకంగా హాలీవుడ్ నటి దెయ్యాలతో ఉన్నానని చెప్పడంతో ఈ టాపిక్ సంచలనంగా మారింది. ఇటీవల ‘ఎటర్నల్స్’ సినిమాలో సూపర్ హీరోగా నటించిన సల్మా హాయక్ తన లండన్ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని తెలిపారు.
‘ది ఎల్లెన్ డిజెనెరెస్’ షోకు హాజరైన సందర్భంగా హాయక్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇంట్లో తాను ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల గురించి తెలిపారు. ఇంట్లో పియానో దానంతట అదే మోగేదని.. మూడో అంతస్తులో ఉన్న లైట్లు.. వాటంతట అవే వెలిగేవి.. ఆరిపోయేవని.. ప్రారంభంలో ఇవన్ని చూసి బెదిరిపోయానని చెప్పుకొచ్చారు. మనుషులు ఎవరు కనిపించే వారు కారని.. ఆ తర్వాత ఇది దెయ్యాల పనే అని అర్థమైందని చెప్పారు. ఎప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూడలేదని అన్నారు.
కానీ విచిత్ర సంఘటనలు చోటు చేసుకునేవని.. అందుకే దెయ్యాలను తరిమే వ్యక్తిని తీసుకువచ్చానని చెప్పారు. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈ ప్రయత్నం వల్ల వాటిని ఇంటి నుంచి తరిమేశాను అనే తృప్తి కలుగుతుందని.. భయం తగ్గి ప్రశాంతంగా ఉంటానని చెప్పుకొచ్చారు.