ప్రముఖ కథానాయిక త్రిషపై… నిన్నటి తరం సీరియస్ విలన్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సౌత్ సెలబ్రిటీలు, జనాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నటీమణులు, స్టార్ హీరోలు సైతం ఈ విషయంలో మన్సూర్ అలీ ఖాన్‌ను తప్పుపడుతున్నారు. సినిమా జనాల రియాక్షన్ విషయంలో ఒకవైపు నుండి మద్దతు వస్తుంటే… మరోవైపు నుండి వాళ్లు గతంలో చేసిన పనులు, అన్న మాటలను ఉదహరిస్తూ… ఖండనను వ్యతిరేకిస్తున్నారు.
అయితే త్రిష – మన్సూర్ విషయం ఓ కొలిక్కి రాకముందే మరో నటి తన కష్టాన్ని చెప్పుకుంది. గతంలో ఓ తెలుగు సినిమాలో నటించినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ప్రజల ముందు ఉంచింది. ఎప్పుడో 1991లో కెరీర్ మొదలుపెట్టి తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించిన విచిత్రనే ఆ కష్టాల కామెంట్లు చేసింది. ఇటీవల బిగ్‌బాస్ తమిళషోలో కూడా ఆమె పాల్గొంది. తమ జీవితంలోని గుర్తుపెట్టుకుని, టర్నింగ్ పాయింట్ లాంటి సంఘటన చెప్పమన్నప్పుడు విచిత్ర ఓ సంఘటన చెప్పింది. ఇప్పుడు ఆ కామెంటే వైరల్ అవుతోంది.
2000 – 2001 సమయంలో ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు షూటింగ్ బ్రేక్‌లో ఆ సినిమా హీరో గదికి రమ్మని పిలిచాడు అంటూ నాటి రోజును గుర్తు చేసుకుంది. అయితే దానికి తిరస్కరించిన విచిత్ర ఆ విషయాన్ని దర్శకుడి దృష్టికి తీసుకెళ్తే… ఆయన రివర్స్‌లో మందలించి తిట్టి పంపించారట. అంతేకాదు ఆ తర్వాత సినిమా టీమ్ నుండి వేధింపులు మొదలయ్యాయి అని చెప్పుకొచ్చింది. పాలక్కడ్ ప్రాంతంలో ఆ సినిమా షూటింగ్ జరిగిందని కూడా చెప్పింది (Vichitra) విచిత్ర.
ఆ వ్యవహారం తర్వాత తాను నటించిన షాట్స్ ఏవీ ఓకే అవ్వలేదని, రోజూ ఎవరో ఒకరు తన రూమ్ తలుపు తట్టి అసభ్యంగా మాట్లాడేవారని నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది విచిత్ర. అయితే ఆమె నటించిన ఏకైక తెలుగు చిత్రం ఏంటో నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఆమె సినిమా పేరు చెప్పకపోవడం గమనార్హం. కాస్టింగ్ కౌచ్ అంటూ గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినప్పుడు ఇలానే చాలామంది ముందుకొచ్చారు. అయితే ఇప్పుడు త్రిష విషయంలో జరిగినదానికి ముందుకొచ్చిన స్టార్లు, నటీమణులు ఇప్పుడు ఆ నటి కష్టం విషయంలో ఎలా స్పందిస్తారు అనే ప్రశ్న సోషల్ మీడియాలో కనిపిస్తోంది.