సినీ పరిశ్రమలో నటీనటులది కలర్ ఫుల్ లైఫ్, వాళ్ళకి కష్టాలు ఏమీ ఉండవు అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా విషాదం దాగి ఉంటుంది. వాళ్ళు సక్సెస్ అయితేనో.. లేదా సక్సెస్ అయ్యి ఫేడౌట్ అయితేనో తప్ప.. ఇలాంటి విషయాలు బయటకి రావు. ఈ కోవలోకే వస్తుంది నటి సులక్షణ. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తక్కువ టైంలోనే పాపులర్ అయ్యింది.
అయితే ఈమెకి చిన్న వయసులోనే పెళ్లి జరగడం, తర్వాత పిల్లలు పుట్టడం వంటి కారణాలతో సినిమాలకి దూరమైంది. అయితే అటు తర్వాత ఈమె మనస్పర్థల కారణంగా భర్తతో విడాకులు తీసుకుని.. మళ్ళీ వెండితెర పై ప్రత్యక్షమైంది. ఓ ఇంటర్వ్యూలో సులక్షణ మాట్లాడుతూ.. “18 ఏళ్లకే నా పెళ్లైంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎస్.విశ్వనాథన్ కొడుకు గోపికృష్ణన్ ని నేను పెళ్లి చేసుకున్నాను. మాకు ముగ్గురు పిల్లలు. కానీ మా మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవడమే బెటర్ అనిపించింది.
అందుకే 23 ఏళ్ళ వయసులోనే విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకోలేదు. ఆ ఆలోచన కూడా నాకు రాలేదు. అయితే విడాకులు తీసుకునే రోజున కోర్టులో గుక్క పెట్టి ఏడ్చేశాను. ఎందుకంటే ఆ టైంలో సర్వస్వం కోల్పోయినట్టు అనిపించింది. విడాకుల తర్వాత నా పిల్లలకి అన్నీ నేనే అవ్వాల్సి వచ్చింది. భరణం అడగమని.. అది పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుంది అని మా లాయర్ నాకు చెప్పారు.
కానీ నా కష్టం పై నేను బ్రతకగలను అని చెప్పి వద్దన్నాను. పిల్లల కోసమే తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టాను” అంటూ ఆమె దీనగాథని చెప్పుకొచ్చింది. ఇక సులక్షణ ‘శుభోదయం’ ‘ప్రేమ నక్షత్రం’ ‘మా ఇంటాయన కథ’ ‘మా ఇంటి ప్రేమాయణం’ ‘అల్లుళ్ళు వస్తున్నారు’ ‘డబ్బెవరికి చేదు’ వంటి సినిమాల్లో నటించింది. ఈమె (Sulakshana) సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాజమహేంద్రవరం.