సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఎవరొక సెలబ్రిటీ మరణిస్తూనే ఉన్నారు. అనారోగ్య సమస్యలతో కొంతమంది, ప్రమాదవశాత్తు ఇంకొంతమంది, ఆత్మహత్యలు చేసుకుని ఇంకొంత మంది ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. టాలీవుడ్లోనే కాదు మిగతా సినీపరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలు కూడా మరణిస్తుండటం గమనార్హం. నిన్నటికి నిన్న కె.జి.ఎఫ్ నటుడు హరీష్ రాయ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ తో బాధపడుతూ వచ్చిన ఆయన నిన్న ప్రాణాలు విడిచారు. ఇంతలోనే మరో సీనియర్ నటి కూడా మరణించినట్టు తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సీనియర్ నటి సులక్షణ పండిట్ మృతి చెందారు. గురువారం నాడు ఆమెకు గుండెపోటు రావడంతో చివరి శ్వాస విడిచినట్టు తెలుస్తుంది. ఆమె వయసు 71 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆమె.. ఇటీవల బాగానే ఉన్నప్పటికీ .. అనూహ్యంగా ఛాతిలో నొప్పి రావడంతో ప్రాణాలు విడిచినట్టు స్పష్టమవుతుంది.సులక్షణ అంత్యక్రియలు ఈరోజు నిర్వహించబోతున్నట్లు ఆమె సోదరుడు లలిత్ వెల్లడించారు. తన సోదరి మరణ వార్త డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టు ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు.
ఛత్తీస్గడ్..కి చెందిన సులక్షణ పండిట్.. సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. ఆమె మొదట ప్లే బ్యాక్ సింగర్ గా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ‘సంకల్ప్’ సినిమాలో ఆమె పాడిన పాటకు గాను ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. అటు తర్వాత నటిగా మారారు సులక్షణ. రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్,జితేంద్ర, శత్రుజ్ఞ సిన్హా వంటి బడా స్టార్స్ సినిమాలో నటించి మరింతగా పాపులర్ అయ్యారు సులక్షణ.