సూపర్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం తొక్కిసలాట కేసు నేపథ్యంలో వివాదాల్లో ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఈ వివాదం పెద్దదిగా మారింది. ఈ ఘటనలో నేరారోపణలు ఎదుర్కొంటున్న బన్నీకి నటి సంజనా గల్రానీ బలమైన మద్దతు తెలిపారు. సంజనా గల్రానీ (Sanjjanaa Galrani) మాట్లాడుతూ, అల్లు అర్జున్ ఈ ఘటనకు బాధ్యుడు కాదని, ఆయనను కావాలనే ఆరోపణల బారిన పెట్టారని అభిప్రాయపడ్డారు.
‘‘తన అభిమానులతో కలిసేందుకు థియేటర్‌కు వెళ్లడం ఒక స్టార్ హీరోగా అల్లు అర్జున్ చేయాల్సిన కర్తవ్యమే. కానీ అతనిపై నేరారోపణలు పెట్టడం సరైన పని కాదు’’ అని అన్నారు. ఆ ఘటనను ప్రస్తావిస్తూ, ‘‘తాను కూడా ఒకసారి వ్యవస్థకు బలైపోయానని’’ సంజనా తెలిపారు. ‘‘ఇలాంటి సందర్భాల్లో ప్రజల ప్రవర్తనను పూర్తిగా నియంత్రించడం అసాధ్యం. అల్లు అర్జున్ కు అభిమానులు అధికంగా ఉండటంతో ఆయనను లక్ష్యంగా తీసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ట్రాల్లో హీరోల అభిమానులు హీరోలను దేవుళ్లుగా భావిస్తారని, కొన్నిసార్లు వారి ఉత్సాహం చెడ్డపరిస్థితులకు దారి తీస్తుందని అన్నారు. ‘ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. కానీ ఈసారి ప్రత్యేకంగా బన్నీపై నేరారోపణలు చేయడం అన్యాయంగా అనిపిస్తోంది’’ అని తెలిపారు. అలాగే, ‘‘అల్లు అర్జున్ న్యాయపరంగా ఎదుర్కొనే ధైర్యం చూపించడాన్ని నేను అభినందిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో కష్టం’’ అని సంజనా చెప్పారు. బన్నీకి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని, అభిమానులు సైతం సానుకూలంగా స్పందించి పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.