Sridevi Soda Center: ‘శ్రీదేవి సోడా సెంటర్‌’.. ఫలితంపై స్పందించిన దర్శకుడు… ఏమన్నారంటే?

అంత ఈజీ కాని కథతో చేసిన తొలి సినిమాతో మంచి విజయం అందుకున్నారు దర్శకుడు కరుణ కుమార్‌ (Karuna Kumar)  . తెలుగు సినిమాలో అలాంటి కథలు కొత్త కాదు, అలాంటి ట్విస్ట్‌లు కొత్త కాదు. అయితే ఆయన ఎంచుకున్న నేపథ్యం, వినిపించి.. కనిపించిన నేటివిటీ సినిమాకు కొత్తదనం తీసుకొచ్చాయి. దానికితోడు ఆయన రాసిన పాత్రల చిత్రణ కూడా నచ్చడంతో సినిమాకు మంచి ఆదరణే దక్కింది. అయితే వెంటనే ఆయన చేసిన సినిమా ఫలితం దారుణంగా తేడా కొట్టేసింది.

Sridevi Soda Center

భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమానే ‘శ్రీదేవి సోడా సెంటర్’ (Sridevi Soda Center) . ‘పలాస’ సినిమా తీసిన దర్శకుడు కరుణ కుమార్‌ నుండి వస్తుండటంతో ‘..సోడా సెంటర్’తో విజయం పక్కా అనుకున్నారు. కానీ సోడాలో గ్యాస్‌ లేదని జనాలు పట్టించుకోలేదు. ఫలితం సంగతి చెబుతారా అని ఆయనను అడిగితే.. మొహమాటాలు, ఇబ్బందులే కారణమని తేల్చి చెప్పారు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ప్రాజెక్టును నిజాయితీగా స్టార్ట్‌ చేశాం. కానీ చాలామంది సినిమా విషయంలో చేతులు పెట్టేశారు.

అలా ప్రమేయాలు ఉంటాయని తనకు తొలి రోజే తెలిస్తే సినిమా చేసేవాడ్ని కాదు అని చెప్పారు. రైటింగ్, టేకింగ్‌లో ఇతరులు వేలు పెట్టడం వల్లే అలా జరిగిందని చెప్పారు. అంతేకాదు కొందరు చేసి సినిమా స్క్రిప్ట్‌నే మార్చేశారు అని అంటున్నారు. సినిమాలో ఇప్పుడు చూస్తున్న స్క్రిప్ట్ పాయింట్ ముందు అనుకున్నదే కానీ.. మిగిలిందంతా మార్చేశారు అని చెప్పారు కరుణ కుమార్‌. ఇక కరుణ కుమార్‌ ప్రస్తుతం దర్శకత్వం వహించిన చిత్రం ‘మట్కా’ (Matka)  విడుదలకు సిద్ధంగా ఉంది.

వరుణ్‌ తేజ్‌ (Varun Tej)  – మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కరుణ కుమార్‌ మీడియా ముందుకు వచ్చినప్పుడే ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమా గురించి చెప్పుకొచ్చారు. అన్నట్లు ‘మట్కా’ సినిమా విషయంలో గత సినిమాలా ఎవరూ చేతులు పెట్టలేదు అని క్లారిటీ ఇచ్చారాయన.

‘గేమ్ ఛేంజర్’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus