ఎన్టీయార్ బయోపిక్స్ అంటూ.. జరుగుతున్న పరిణామాలు నిజంగా బాధాకరం. నిజమైన అన్నగారి అభిమానులను ఈ పరిణామాలు వేదనకు గురి చేస్తున్నాయ్. కారణజన్మునిగా జనం చేత జేజేలు అందుకున్న మహానుభావుడు జీవితం కొందరు స్వార్థపరులకు ఆట వస్తువుగా మారడం శోచనీయం.
ఏ నక్షత్రంలో జన్మించాడో కానీ.. పుట్టినప్పటి నుంచి ఎన్టీయార్ చేతిని ఆ భగవంతుడు విడచిపెట్టలేదు. తనతోటే ఆయన్ను నడిపించాడు. తనంతవాడ్ని చేసి… చివరి రోజుల్లో చేయి వదిలేశాడు. అక్కడ్నుంచి ఆయన జీవితం విషాదకరమే. ఇవి అందరికీ తెలిసిన నిజాలే. ఆమాటకొస్తే.. నేటితరానికి కూడా తెలుసు. ప్రత్యేకించి మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదు. నిజానికి ఆ వ్యవహారం పూర్తిగా తెలిసిన మనుషులు ఇద్దరు. వారే చంద్రబాబు, లక్ష్మీపార్వతి. వాళ్లు కూడా నిజాలను నిర్భయంగా చెప్పలేని పరిస్థితి. అలాంటప్పుడు సినిమాలు తీసి ఉపయోగం ఏంటి? ఎన్టీయార్ ఆత్మను క్షోభింపజేయడం తప్ప.
కర్ణుడికి మరణానికి ఎన్నో కారణాలు. ఎన్టీయార్ విషయంలో కూడా అంతే. కొందరి స్వార్థానికి ఆయన బలైపోయారు. అలాగే… స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయ్. అవి కూడా ఆయన్ను బలితీసుకున్నాయ్. సో.. వాటిని మళ్లీ తెలుసుకున్నంతమాత్రాన ఎవరికీ ఒరిగేది లేదు. చివరకు ఆ విషాదాన్ని కూడా అడ్డుపెట్టుకొని బావుకుందాం అని చూడడం.. నీచమైన చర్యే. క్షమించకూడని చర్య.
బాలకృష్ణ తన తండ్రి కథను సినిమాగా తీయాలనుకున్నాడు. నిజానికి ఎన్టీయార్ లాంటి మహనీయుని జీవితం నేటి తరానికి ఆదర్శం. దాన్ని సినిమాగా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే… సమాజానికి కావాల్సింది అన్నగారి పోరాటం మాత్రమే. నిమ్మకూరులో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు… ఇంతింతై వటుడింతై అన్న చందాన… మహాశక్తిగా ఎదగడం.. తెలుగు సినిమాను 35 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలడం.. ఎదురులేని సూపర్ స్టార్ గా నిలవడం.. నటనకు కొత్త భాష్యం చెప్పడం… తెలుగు ప్రజలందరూ తమ తల్లిదండ్రుల తర్వాత అంతగా ఆరాధించే వ్యక్తిగా ఎదగడం.. ఇది నేటి తరానికి తెలియాల్సింది. 9 నెలల్లో పార్టీ పెట్టి.. ఏ విధంగా దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీని మట్టి కరిపించాడో నేటి తరానికి తెలియాలి. మదరాసీలు అని పిలవబడుతున్న తెలుగువాళ్లకు ఏ విధంగా ఓ గుర్తింపునిచ్చాడో తెలియాలి. ఇవి ఎన్టీయార్ బయోపిక్ ద్వారా నేటి సమాజానికి తెలియాల్సింది. అంతేకానీ… చివరి రోజుల్లో ఆయన ఎదుర్కొన్న పరిణామాలు నేటి సమాజానికి అనవసరం.
నిజానికి రామ్ గోపాల్ వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ప్రకటించిన వెంటనే… లక్ష్మీపార్వతి దాన్ని ఖండించి ఉండాల్సింది. కానీ.. ఆమె సపోర్ట్ చేసింది. తన భర్త చివరి రోజుల్లో జరిగింది అందరికీ తెలియాలి… అని మీడియా సాక్షిగా అంది. ఇప్పుడు ఆమె కథనే సినిమాగా తీయడానికి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సిద్ధపడేసరికి… ‘ఇది అన్యాయం..’ అంటూ ఎన్టీయార్ ఘాట్ వద్ద నిరసనకు దిగింది. తీస్తే తీవ్ర పరిణామాలుంటాయ్ అని హెచ్చరించించింది కూడా. అంటే.. నీళ్లు తన కిందకొస్తే కానీ… అర్థం కాకపోతే ఎలా?
‘భారతరత్న’ అందుకోదగ్గ మహనీయుడు ఎన్టీయార్. తెలుగువారి అద్భుత జ్ఙాపకం ఆయన. ఎన్టీయార్ అంటే… తెలుగోడి ఆస్తి. భౌతికంగా మనకు దూరమైన ఆ గొప్పవ్యక్తిని బయోపిక్ ల పేరుతో మళ్లీ మళ్లీ చంపడం నిజంగా దారుణం. ఈ దురాదగతాలకు ఇకనైనా స్వస్తి పలకండి.. ప్లీజ్.
మళ్లీ మళ్లీ చెబుతున్నాను… పుజనీయుల జీవితాల్లో కూడా చిన్న చిన్న లోపాలు సహజం. వారి గొప్పతనం భావితరాలకు కావాలి తప్ప.. వారి లోపాలు అనవసరం. వారి జీవితాలపై రంధ్రాణ్వేషణ చేస్తే… రంధ్రాలే మనకు మిగులుతాయ్. వారి గొప్పతనాన్ని ప్రభోదిస్తే.. అది భావితరాలకు ఆదర్శం అవుతుంది. ఇకనైనా.. ఈ బయోపిక్ ల రచ్చ ఆపండి!