మళ్లీ అలాంటి పాటలు ఎందుకు చేయలేదా అని అనుకుంటూ ఉంటుందట!

నిన్నటి తరానికి సోనాలీ బింద్రే (Sonali Bendre)  అంటే స్టార్‌ హీరోయిన్‌గా మాత్రమే తెలుసు. అయితే ఆమె తొలి రోజుల్లో ఓ ఐటెమ్‌ సాంగ్‌ చేసింది అంటే నమ్ముతారా? అప్పటికి ఆ పాటలకు స్పెషల్‌ సాంగ్స్‌ అనే అనేవారులెండి. ఇక ఆ విషయాన్ని పక్కనపెడితే… ఆ పాటలో ఆమె వేసిన స్టెప్పులు, చూపించిన హొయలు మత్తెక్కించేశాయి అని అంటుంటారు అప్పటితరం కుర్రాళ్లు. ఓ హీరోయిన్‌ను అలా చూడటం అప్పట్లో అదే కొత్తలెండి. నాటి గురించి ఇప్పుడు సోనాలీ మాట్లాడింది. దీంతో ఆ విషయాలు వైరల్‌గా మారాయి.

పైన చెప్పినట్లు సోనాలీ బింద్రే అంటే.. మనకు ‘మురారి’ (Murari) , ‘ఇంద్ర’ (Indra) , ‘మన్మథుడు’ లాంటి సినిమాలే గుర్తొస్తాయి. ఆ సినిమాల తర్వాత బాలీవుడ్‌ వెళ్లిపోయిన ఈ అందం… అనారోగ్యంతో సినిమాలకు దూరమైంది. క్యాన్సర్‌ నుండి కోలుకుని ఇప్పుడు ఫుల్‌ ప్లెడ్జ్‌గా సినిమాలు చేస్తోంది. వెబ్‌ సిరీస్‌లకు కూడా పచ్చ జెండా ఊపుతోంది. ఈ క్రమంలో చేసిన ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ సిరీస్‌కు కొనసాగింపుగా ‘ది బ్రోకెన్‌ న్యూస్‌ 2’ సిద్ధం చేశారు. ఆ సిరీస్‌ స్ట్రీమింగ్‌కి సిద్ధమైన నేపథ్యంలో.. ఆమె మీడియాతో మాట్లాడింది.

డ్యాన్స్‌ రాకపోతే కథానాయికగా రాణించలేమని ఒకప్పడు అనుకునేవారని, ఆ సమయంలోనే తాను సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని గుర్తు చేసింది సోనాలీ. తొలి రోజుల్లో డ్యాన్స్‌ చేయడంలో నైపుణ్యం లేదని నృత్య దర్శకులతో చీవాట్లు పడిందట. ఆ మాటల భరించలేక ఏమాత్రం ఖాళీ దొరికినా డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేసేదట. ‘బొంబాయి’ సినిమాలో ‘హమ్మా.. హమ్మా..’ పాటలో అవకాశం వచ్చినప్పుడు ఐదు సినిమాలు చేసిన అనుభవం మాత్రమే ఉందని చెప్పింది.

ఆ పాట బాగా చేయాలి అని కొరియోగ్రాఫర్‌ రాజు సుందరంతో కలసి కష్టపడి డ్యాన్స్‌ చేసిందట. ఆ పాట ఎవరికీ నచ్చకపోతే బ్యాగు సర్దుకొని ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకున్నాను అని కూడా చెప్పింది. అంతేకాదు ఆ తర్వాత సినిమాల్లో అలాంటి పాటలు ఎందుకు చేయలేకపోయాను అనే బాధ ఇప్పటికీ ఉంది అని చెప్పింది సోనాలీ బింద్రే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus