సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంత్.. ఈ మధ్యనే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘బేబీ’ నిర్మాత ఎస్.కె.ఎన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఇక తాజాగా సీనియర్ జర్నలిస్ట్, సినీ దర్శకుడు అయిన కె.జయదేవ్ కూడా ప్రాణాలు విడిచారు. సోమవారం నాడు ఆయన గుండె పోటుతో మరణించడం జరిగింది.
జయదేవ్ దర్శకత్వం వహించిన ‘కోరంగి నుంచి’ అనే సినిమాని జాతీయ,అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ షాక్ నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోక ముందే ఇప్పుడు ఇంకో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రషీద్ ఖాన్ ఈరోజు కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ వచ్చిన ఆయన (Rashid Khan) కోల్ కతాలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.
ఇష్కేరియా, షాదీ మైన్ జరూర్ ఆనా, హేట్ స్టోరీ 2 , రాజ్ 3 , కర్లే ప్యార్ కర్లే, మౌసమ్ వంటి సినిమాలకు పనిచేశారు. ఈయనకి ఇండియన్ గవర్నమెంట్ నుండి పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు కూడా లభించాయి. ఈయన వయసు 55 ఏళ్ళు మాత్రమే కావడం విషాదకరం. ఇక రషీద్ ఖాన్ మరణవార్తతో హిందీ చిత్ర సీమలో విషాద వాతావరణం ఏర్పడింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అంతా కోరుకుంటూ తమ సంతాపం తెలియజేస్తున్నారు.