జబర్దస్త్‌ ‘త్రీ మంకీస్‌’ కలసి సినిమా చేస్తారట.. కథ ఎవరిదంటే?

  • May 25, 2024 / 07:37 PM IST

తెలుగు సినిమా పరిశ్రమకు ఈటీవీ – మల్లెమాల ‘జబర్దస్త్‌’ మంచి కమెడియన్లనే కాదు.. ఫర్వాలేదు అనిపించే హీరోలను ఇచ్చింది. అలాగే అదరగొట్టే దర్శకులను కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇదే క్రమంలో అదే హౌస్‌ నుండి మరో దర్శకుడు రాబోతున్నారు. ఇప్పటికే రైటర్‌గా తన కలం పవర్‌ చూపించిన ఆయన.. కొన్ని సినిమాలకు ప్రముఖ యువ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్‌ (Prasanna Kumar Bezawada) దగ్గర వర్క్‌ కూడా చేశారు. ఆయనే ఆటో రామ్‌ప్రసాద్‌ (Jabardasth Ram Prasad) . ఇప్పుడు దర్శకుడిగా మారడానికి కథలు రాస్తున్నారట.

‘జబర్దస్త్‌’ హౌస్‌ నుండి ఇప్పటివరకు షకలక శంకర్ (Shakalaka Shankar) , సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) , గెటప్ శీను (Getup Srinu) , ధనరాజ్‌ (Dhanraj) హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకున్నారు. ‘బలగం’ సినిమాతో వేణు యెల్దండి క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు. త్వరలోనే ధనరాజ్ ‘రామం రాఘవం’ (Ramam Raghavam) సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. హైపర్ ఆది (Hyper Aadi) , చమ్మక్ చంద్ర (Chammak Chandra) , మహేశ్ ఆచంట (Mahesh Achanta) , రాకెట్ రాఘవ (Rocket Raghava) .. సపోర్టింగ్ రోల్స్‌తో మెప్పిస్తున్నారు. వీళ్లు కాకుండా చిన్న చిన్న పాత్రల్లో చాలామంది జబర్దస్త్‌ నటులు కనిపిస్తున్నారు.

తనదైన శైలిలో వన్‌లైనర్లు, ఆటో పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఆటో రామ్ ప్రసాద్ త్వరలోనే డైరెక్టర్‌ అవ్వబోతున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్‌ప్రసాద్ కలసి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట. అంతేకాదు ఆ సినిమా కోసం రామ్‌ప్రసాద్‌ ఇప్పటికే ఓ కథను సిద్ధం చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ సినిమాకు మెగాఫోన్‌ పట్టబోయేది ఆయనే అని చెబుతున్నారు.

ఆన్ స్రీన్‌లోనే కాదు రియల్ లైఫ్ లోనూ సుధీర్‌, శ్రీను, రామ్‌ప్రసాద్‌ మంచి స్నేహితులు. ఈ క్రమంలో గతంలో ‘త్రీ మంకీస్‌’ అనే సినిమా చేశారు. ఇప్పుడు సొంత కథతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. నిర్మాత దొరికి, కథ నచ్చితే ఆ సినిమా పట్టాలెక్కుతుంది. మరి రామ్‌ప్రసాద్‌ ఎలాంటి కథ రాస్తున్నారో తెలియాలి. గెటప్‌ శ్రీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్‌’ (Raju Yadav) సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus