సుబ్రమణ్యపురం

“మళ్ళీరావా”తో చాలారోజుల తర్వాత డీసెంట్ హిట్ అందుకొన్న సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “సుబ్రమణ్యపురం”. ఫిక్షనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ద్వారా సంతోష్ దర్శకుడిగా పరిచయమవ్వగా.. ఈషా రెబ్బ కథానాయికగా నటించింది. మరి సుమంత్ తన సక్సెస్ ను కంటిన్యూ చేశాడా, ప్రేక్షకుల్ని అలరించగలిగాడా? అనేది తెలుసుకొందాం..!!

కథ:


కార్తీక్ (సుమంత్) ఆర్కియాలజీ విద్యార్హి. గుళ్ళు, వాటి చరిత్ర గురించి అధ్యయనం చేస్తుంటాడు. అలా అధ్యయనంలో భాగంగా “సుబ్రమణ్యపురం” వస్తాడు. అక్కడ వెలసిన సుబ్రమణ్యస్వామికి అభిషేకం చేయించకూడదు అనేది అనాధిగా ఆచరిస్తున్న ఆచారం. అయితే.. ఆ ఊరి కుర్రాడొకడు తాగిన మైకంలో సుబ్రమణ్య స్వామి విగ్రహానికి అభిషేకం చేస్తాడు. అప్పట్నుంచి ఊర్లో కొందరు నెమలి కనిపించి మరణిస్తుంటారు. వారి మరణానికి కారణం సుబ్రమణ్యస్వామి ఆగ్రహం అని ఊరి జనాలు అనుకొంటుంటారు. కానీ.. ఆ చావుల వెనుక ఉన్నది దేవుడి కోసం కాదని, మనిషేనని నమ్ముతాడు కార్తీక్.

తన యుక్తితో కార్తీక్ అక్కడ జరుగుతున్న వరుస ఆత్మహత్యల వెనుక ఉన్న నిజాని ఎలా బయటపెట్టాడు అనేది “సుబ్రమణ్యపురం” కథాంశం.

నటీనటుల పనితీరు:


కార్తీక్ పాత్రలో చాలా రియలిస్టిక్ గా నటించాడు సుమంత్. కాకపోతే.. సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని మాత్రం ప్రతిబింబించలేకపోయాడు. ఓవరాల్ గా క్యారెక్టర్ ను న్యాయం చేశాడు. కానీ.. “కార్తికేయ” సినిమాలో నిఖిల్ ది కూడా ఆల్మోస్ట్ ఈ తరహా క్యారెక్టరైజేషనే కాబట్టి నిఖిల్ నటనతో కంపేర్ చేయడం ఖాయం. తెలుగమ్మాయి ఈషా రెబ్బ పాత్ర చిన్నదే అయినా పర్వాలేదనిపించుకొంది. అమ్మాయి పాత్రకి ఇంకాస్త వెయిట్ ఇచ్చి ఉంటే బాగుండేది. స్నేహితుడి పాత్రలో జోష్ రవి పరిణితి చెందిన నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో మనోడి నటన చూస్తే.. ఇంత మంచి ఆర్టిస్ట్ కి ఎందుకు సినిమాలు రావడం లేదు అని ఆశ్చర్యపోతుంటాం. ఊరి పెద్ద పాత్రలో సుమన్, డాక్టర్ గా సాయికుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:


శేఖర్ చంద్ర సంగీతం వినసోంపుగా ఉంది కానీ.. ప్రేక్షకులు గుర్తుంచుకునే స్థాయిలో మాత్రం లేదు. అలాగే.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా యావరేజ్ గా ఉంది. నిజానికి ఈ తరహా సినిమాలు ప్లస్ పాయింట్ గా నిలవాల్సిన బీజీయమ్ సరిగా వర్కవుట్ అవ్వకపోవడం సినిమాకి పెద్ద మైనస్. సినిమాటోగ్రఫీ వర్క్ యావరేజ్ గా ఉంది. ఒక థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన లైటింగ్ కానీ, ఫ్రెమింగ్స్ కానీ కనిపించలేదు. ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగుంది. చాలా చిన్న చిన్న విషయాల్లోనూ శ్రద్ధ కనబరిచారు. తాళపత్రాలు, ఆ పత్రాలను దాచిన స్థలం వంటివి చాలా చక్కగా క్రియేట్ చేశారు.

దర్శకుడు ఎంచుకున్న కథలో కార్తికేయ కొట్టొచ్చినట్లు కనబడితే.. అంతర్లీనంగా “ఖలేజా” అగుపిస్తుంటుంది. పాత్రధారులను చక్కగా క్యాస్ట్ చేసుకున్న డైరెక్టర్.. క్యారెక్టరైజేషన్స్ లో కొత్తదనం మాత్రం మిస్ అయ్యాడు. అందువల్ల.. ఒక్క సుమంత్ పాత్రలో తప్ప ఎవరి పాత్ర వ్యవహారశైలిలోను క్లారిటీ ఉండదు. ఇక కథలోని ట్విస్టులను రివీల్ చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. అందువల్ల కథనం సాగుతున్న ఫీలింగ్ ఉంటుంది. ముఖ్యంగా.. క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం సినిమాకి మైనస్. ఎప్పుడైనా సరే.. వేసిన చిక్కుముడిని, చిక్కులు పడినా విడదీయడం ముఖ్యం. ఆ సూత్రాన్ని మరచాడు సంతోష్. సినిమాకి చాలా కీలకమైన అంశానికి సమాధానం చెప్పకుండా సినిమాని ముగించేశాడు. అందువల్ల ప్రేక్షకుల్లో తెలియని అసహనం చోటు చేసుకుంటుంది.

విశ్లేషణ:


ఒక థ్రిల్లర్ కి కావాల్సిన కీలకమైన లక్షణాలు మిస్ అయిన ఈ “సుబ్రమణ్యపురం” ప్రేక్షకుల్ని రెండుగంటలపాటు థియేటర్లో కూర్చోబెట్టడం కాస్త కష్టమే. కానీ.. అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే పర్వాలేదనిపూస్తుంది.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus