సుధాకర్ చెరుకూరి సినిమా నిర్మాణంలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఎప్పుడో 2016లో సందీప్ కిషన్ ‘రన్’తో ప్రారంభమైన ఆయన ప్రొడ్యూస్ ప్రయాణంలో ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో మంచి విజయం అందుకున్నారాయన. పదేళ్ల కెరీర్‌లో ఎనిమిది సినిమాలు రూపొందించిన ఆయన చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ ఏడాదిలోనే రాబోతున్నాయి. అందులో రెండు పెద్ద సినిమాలు ఉండగా.. రెండు మోస్తారు సినిమాలు ఉన్నాయి
చిరంజీఇ – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి – నాని నిర్మాతలు అనే విషయం తెలిసిందే. ఈ సినిమా కొన్ని నెలల క్రితమే అనౌన్స్ అయింది. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో షూటింగ్ ప్రారంభించుకోబోతోంది. సినిమా పోస్టర్‌లో బ్లడ్ చూపించి ఎలా ఉండబోతోందో అప్పుడే చెప్పేశారు. ఇక ఈ సినిమా 1970 నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ కథతో రూపొందుతుంది.
అలాగే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి హిట్ బొమ్మ ఇచ్చిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా రూపొందించబోతున్నారు సుధాకర్ చెరుకూరి. ఈసారి ఓ ప్రేమకథను తీసుకొస్తున్నారట. యంగ్ హీరో ఇందులో నటిస్తాడని సమాచారం. ఇక దుల్కర్ సల్మాన్ – పూజా హెగ్డే కాంబినేషన్‌లో రవిబాబు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం అనౌన్స్ అయిన ‘కె.జె.క్యూ’ను త్వరలోనే రిలీజ్ చేస్తామని నిర్మాత చెప్పారు.
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా కలసి నటించిన సినిమా ‘కె.జె.క్యూ’. ఈ సినిమా దర్శకుడు కె.కె. (కిరణ్ కుమార్) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. సినిమా పనులు ఓ కొలిక్కి వచ్చాయట. అయితే మరికొన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ చేయబోతున్నారు. ఇలా వరుస సినిమాలతో సుధాకర్ చెరుకూరి బిజీగా ఉన్నారు.