రజనీకాంత్ (Rajinikanth) – లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’ (Coolie). ఈ సినిమా గురించి గత కొన్ని నెలలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ సినిమాను ఊహించని స్థాయిలో లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారని, రజనీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోతుంది అని చెబుతున్నారు. వీటికితోపాడు కొన్ని స్పెషల్ పాత్రలు ఉన్నాయని, అవి సినిమాకు మంచి యాడ్ ఆన్స్ అవుతాయి అని కూడా అంటున్నారు. అయితే, తొలిసారి ఈ సినిమా టీమ్‌కు బాగా దగ్గరైన ఓ యువ హీరో సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనే సందీప్ కిషన్.
‘మాజాకా’ (Mazaka) సినిమాతో మంచి విజయం అందుకున్న సందీప్ కిషన్ (Sundeep Kishan) ‘కూలీ’ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ‘మజాకా’ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు సందీప్ కిషన్. ఈ సినిమా కచ్చితంగా రూ. 1000 కోట్లు సాధిస్తుంది అనేది సందీప్ అంచనా. ‘కూలీ’ సినిమాలోని కొన్ని సీన్స్ చూశానని చెప్పిన సందీప్.. ఈ వెయ్యి కోట్ల రూపాయల కామెంట్స్ చేశారు.
చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఉన్న స్నేహంతో ఇటీవల ‘కూలీ’ సినిమా సెట్స్‌కు వెళ్లానని, అప్పుడే సినిమా ఎలా సిద్ధమవుతుందో పరిశీలించానని సందీప్ కిషన్ చెప్పాడు. అయితే పుకార్లు వచ్చినట్లు తాను ఆ సినిమాలో నటించడం లేదు అని తేల్చేశాడు. ఒకవేళ సందీప్ చెప్పింది నిజమైతే తమిళనాట ఈ స్థాయి వసూళ్లు అందుకున్న తొలి సినిమా అవుతుంది. ఇక ఈ సినిమాకు అంత సీన్ ఉందా అని చూస్తే.. సినిమాలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తున్న నటుల గురించి కూడా చెప్పుకోవాలి.
ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ Aamir Khan), టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) , శాండిల్ వుడ్ స్టార్ ఉపేంద్ర (Upendra) నటిస్తున్నారు. మలయాళ పరిశ్రమ నుండి కూడా ఓ ప్రముఖ నటిస్తున్నారు అని సమాచారం. ఇంతమంది కలిశాక రూ. 1000 కోట్లు రాకపోతే బాగోదు కూడా. ‘జైలర్’ (Jailer) సినిమాతో రూ.600 కోట్లు అందుకున్న తలైవా ఈ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి వస్తారేమో. అన్నట్లు ఈ సినిమాలో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ నటులు వివిధ సందర్భాల్లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది.