హీరోలు తమ పేర్లకు ముందు టైటిల్స్/ట్యాగ్స్ యాడ్ చేసుకోవడం అనేది సర్వసాధారణం. సదరు టైటిల్ గురించి భీభత్సమైన తర్జనభర్జనలు జరిగాక అవి సినిమాల్లో మరియు వాటి పోస్టర్లలో పబ్లిష్ చేస్తారు. చిరంజీవికి (Chiranjeevi) “మెగాస్టార్” అనే బిరుదు ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే స్థాయిలో ఆర్.నారాయణమూర్తికి కూడా “పీపుల్స్ స్టార్” అనే బిరుదు కూడా అంతే ఫేమస్. సినిమా పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ ఆ టైటిల్ ఆయనకి తప్ప ఎవరికీ సెట్ అవ్వలేదు.
ఎందుకంటే.. “రిక్షావోడు, ఎర్ర సైన్యం, చీమల దండు” వంటి సినిమాలతో ఆయన జనాల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. అటువంటి ఆర్.నారాయణమూర్తికి చెందిన “పీపుల్స్ స్టార్” అనే టైటిల్ ను సందీప్ కిషన్ (Sandeep kishan) కి పెట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. అది కూడా ఆర్.నారాయణమూర్తి ఇంకా సినిమాలు చేస్తూ ఉండగా. ఒకవేళ ఆయన లేకుంటే సదరు టైటిల్ ను సందీప్ (Sundeep Kishan) తీసుకున్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
కానీ.. సందీప్ కిషన్ తన తాజా చిత్రమైన “మజాకా”ను 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించుకునేందుకు విడుదల చేసిన పోస్టర్ లో ఇలా పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ అని వేయించుకోవడం ఏమీ బాలేదు. ఒకవేళ ఈ విషయం ఆర్.నారాయణమూర్తి దాకా వెళ్లి ఆయన సర్లే వేసుకోనివ్వండి అన్నా కూడా..
“పీపుల్స్ స్టార్” అనే పేరుకు ఉన్న ప్రాముఖ్యత వేరు, అది కమర్షియల్ సినిమాలు చేస్తున్న సందీప్ కి అనునయించడం అనేది అస్సలు సూట్ అవ్వని విషయం. మరి ఈ విషయాన్ని దర్శకుడు త్రినాథ్ (Trinadha Rao Nakkina) , హీరో సందీప్ కిషన్ మరోసారి ఆలోచించి ఆ టైటిల్ ను మారిస్తే మంచిది. లేదంటే మాత్రం లేనిపోని అపఖ్యాతిని కొనితెచ్చుకున్నవారవుతారు.