బంగారం పేరు చెబితేనే జనాలు బెదిరిపోతున్నారు. రేటు పెరిగిందని కాదు. క్వాలిటీ ఉండట్లేదని. అదేంటి.. హాల్ మార్క్ లాంటి గుర్తులుంటాయి కదా అని ఆలోచించడం మానేసి ‘సినిమా’లోకంలో ఎంట్రీ ఇచ్చుకోండి. మొన్నామధ్య ఓ దర్శకుడు ‘బాబు బంగారం’ అని చెప్పి బాక్సాఫీస్ వద్ద అమ్మకానికి పెట్టాడు. తీరా టికెట్ కొన్నాక తెలిసొచ్చింది.. అది గిల్టు బంగారం అని.
ఇప్పుడు సునీల్ సినిమా పైనా అలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. హీరోగా మారాక హిట్ పదానికి మైళ్ళ దూరంలో నిలిచిపోయిన సునీల్ “బ్యాక్ టు ఎంటర్టైన్” అని ‘జక్కన్న’గా కొద్దిరోజుల క్రితం తెరమీదికొచ్చాడు. ఆ ప్రభావం నుండి ప్రేక్షకులు కోలుకోకముందే ‘ఈడు గోల్డ్ ఎహె’ సినిమాతో మరోమారు పలకరించనున్నాడు. వీరూపోట్ల తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 7న విడుదల కానుంది. దాదాపు మూడేళ్ళ తర్వాత విడుదలవుతోన్న ఈ వీరూ సినిమా పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు.
అయితే దసరా విడుదల దృష్ట్యా ఇటీవల కొన్ని పోస్టర్స్ బయటికొచ్చాయి. వాటిల్లో క్లాస్, మాస్, థ్రిల్లర్, ఎంటర్టైనర్ అని నాలుగు రకాలుగా రాసుంచారు. ఇన్ని కలిపిన బంగారంలో నాణ్యత ఎంత అని ప్రేక్షకుడు లెక్కలేసుకుంటున్నాడు. ఏదేమైనా దసరా సీజన్ సునీల్ సినిమాకి బంగారం లాంటిది. మరి దాన్ని ఎంతవరకు వాడుకుంటాడో.