కామెడీ టైమింగ్ లో సునీల్ స్టయిలే వేరు. ఆ ప్రత్యేకత నచ్చి స్టార్ హీరోల చిత్రాల్లో సునీల్ కి అవకాశాలు ఇచ్చారు. టాలీవుడ్ టాప్ కమెడియన్ గా కొన్నేళ్లు కొనసాగారు. అయితే హీరోగా చేసిన సినిమాలు హిట్ కావడంతో కమెడియన్ రోల్స్ కి నో చెప్పి .. యాక్షన్ లోకి దిగారు. అయితే కథ అడ్డం తిరిగింది. హీరోగా నటించిన సినిమాలు బోల్తా కొట్టడం మొదలెట్టాయి. అందుకే సునీల్ యు టర్న్ తీసుకున్నారు. మళ్లీ కమెడియన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అమర్ అక్బర్ ఆంటోనీ లో ఫుల్ లెన్త్ కామెడీ రోల్ చేస్తున్నారు. మాస్ మహారాజ్ తో కలిసి నవ్వులు పూయించడానికి శ్రమిస్తున్నారు.
అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతోన్న అరవింద సమేత వీర రాఘవలోను మంచి రోల్ చేస్తున్నారు. హీరోగా సినిమాలు చేసేటప్పుడు 3 నుంచి 4కోట్లు డిమాండ్ చేసిన సునీల్ కమెడియన్ రోల్ కోసం భారీగా రెమ్యునరేషన్ తగ్గించినట్లు సమాచారం. అమర్ అక్బర్ ఆంటోనీ కోసం ఒకటిన్నర కోటి, అరవింద సమేత వీర రాఘవ కోసం కోటి రూపాయలు తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ రెండు సినిమాలతో సునీల్ కమెడియన్ గా పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.