టాలీవుడ్లో కొన్ని టిపికల్ కాంబినేషన్లు ఉంటాయి. ఆ ఇద్దరి పేర్లు ఎత్తితేనే ఓ ప్రత్యేకమైన ఫీలింగ్ కలుగుతుంది. గత కొన్నేళ్లుగా వివిధ సందర్భాల్లో, వివిధ అంశాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారిద్దరూ. అయితే వారే నందమూరి బాలకృష్ణ, మోగా బ్రదర్ నాగబాబు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా సాఫ్ట్ వార్ జరుగుతోంది. ఒకరినొకరు నేరుగా విమర్శించుకోకపోయినా… ఏదో సందర్భంలో మాటలు అనుకుంటూ వచ్చారు. అలాంటిది… ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే… అదిరిపోతుంది కదూ.
ఇలాంటి ప్రయత్నమే జరుగుతోంది అంటున్నారు. ‘ఆహా’ కోసం నందమూరి బాలకృష్ణ ఓ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ షో స్ట్రీమింగ్ మొదలవుతుంది. మొదటి ఎపిసోడ్‌కి మోహన్‌బాబు వస్తారని అంటున్నారు. మరి అందులో ఆయనేం చెబుతారు. ఎంత ప్రత్యేకంగా ఉండబోతోంది అని అంచనాలు వేసుకుంటున్నారు అభిమానులు. అయితే ఇక్కడే మరో పాయింట్ కూడా బయటకు వచ్చింది. అదే ఈ షోలో నాగబాబు కూడా పాల్గొంటారని అంటున్నారు.
బాలకృష్ణ షోకి నాగబాబు రావడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే వివిధ సందర్భాల్లో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇటీవల ‘మా’ ఎన్నికల పరిస్థితుల నేపథ్యం కూడా ఇక్కడ కీలకం కాబోతోంది. చూద్దాం ఎలా ఉండబోతోందో ఈ ‘అన్‌స్టాపబుల్’.