Natyam Review: నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

‘నాట్యం’… చాలా రోజుల నుండీ జనాల నోట్లో నానుతున్న సినిమా. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, ఎన్టీఆర్, రాంచరణ్ వంటి బడా స్టార్లు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం… అలాగే టీజర్, ట్రైలర్, విడుదల చేసిన పాటలు.. కొత్తగా మరీ ముఖ్యంగా అలరించే విధంగా ఉండడం.. అంతేకాకుండా నిజ జీవితంలో కూడా నాట్య కళాకారిణి అయిన సంధ్యారాజు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం అలాగే ఆమె ఈ చిత్రాన్ని నిర్మించడం వంటి అంశాలు జనాల్లో ఆసక్తిని రేకెత్తించేలా చేసాయి.మరి వారి అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా ఉందా?లేదా? తెలుసుకుందాం రండి :

కథ: సితార (సంధ్యారాజు) చిన్నప్పటి నుండీ గొప్ప డ్యాన్సర్.కాదంబరి అనే గొప్ప నాట్య కళాకారిణి స్ఫూర్తితో ఈమె నాట్యం నేర్చుకుంటుంది. ఆమె గురువు(ఆదిత్య మీనన్) సమక్షంలో ఈమె కాదంబరి కథని చెబుతూ నాట్య రంగ ప్రవేశం చేయాలనేది ఈమె కోరిక.కానీ అందుకు ఈమె గురువు ఒప్పుకోడు.అనంతరం రోహిత్ (రోహిత్ బెహ‌ల్‌).. సితార నివసించే నాట్యం గ్రామానికి వస్తాడు. అక్కడ వారిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది? అటు తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి ? అసలు ఈ కాదంబరి ఎవరు? సితార ఎందుకు ఆమె గురించి ప్రపంచానికి తన నాట్యం ద్వారా పరిచయం చేయాలనుకుంటుంది? మధ్యలో అతని గురువు ఎందుకు అడ్డం తిరిగాడు? చివరికి ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఈ ‘నాట్యం’ చూడాల్సిందే..!

నటీనటుల పనితీరు: సంధ్యారాజు నిజ జీవితంలో కూడా అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలో కూడా ఆమెకు అలాంటి పాత్రే దొరికింది కాబట్టి.. నటనలో ఎంతో అనుభవం ఉన్నట్టు ఆమె పాత్రని పోషించింది.ఆమె పలికించిన హావభావాలు థియేటర్ నుండీ బయటకి వచ్చాక కూడా ప్రేక్షకుల్ని వెంటాడతాయి అనడంలో సందేహం లేదు.ఇక రోహిత్ బెహ‌ల్‌ బాగానే చేసినప్పటికీ..అతనిది కూడా ప్రాముఖ్యత కలిగిన పాత్రే దక్కినప్పటికీ జనాలకి ఇతని పాత్ర ఎంత వరకు గుర్తుంటుంది? అనేది కచ్చితంగా చెప్పలేము.

ఇక ఆదిత్య మీనన్.. తన కెరీర్లో చేసిన మంచి పాత్రల్లో ఇదొకటని చెప్పొచ్చు. కమల్ కామరాజు పాత్ర గురించి ఎక్కువగా చెప్పుకుంటే స్పాయిలర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అతను కూడా చాలా బాగా నటించాడు.సుధాకర్, భానుప్రియ వంటి మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రలకి న్యాయం చేశారనే చెప్పాలి.

సాంకేతికవర్గం పనితీరు: ఈ విభాగంలో మనం సంగీత దర్శకుడు శ్రవణ్ భ‌రద్వాజ్‌ కు ఎక్కువ మార్కులు వేయాలి.అతను అందించిన సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్. ప్రతీ సీన్ మూడ్ కు క్యారీ అయ్యే నేపధ్య సంగీతాన్ని అందించాడు.పాటలు కూడా చూడ్డానికి బాగున్నాయి. ఇక ఇలాంటి కథని తెరకెక్కించాలి అంటే ఎంతో అనుభవం ఉండాలి… అలాగే విజువల్ గా ప్రెజెంట్ చేయాలి అంటే ఎంతో పరిణితి చెంది ఉండాలి. అయితే తొలి ప్రయత్నం అయినప్పటికీ దర్శకుడు రేవంత్ కోరుకొండ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు.ఎడిటింగ్ కూడా ఇతనే కావడం మరో విశేషం. అయితే ఇక్కడ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇక నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.అందుకు సంధ్యా రాజుని కూడా మెచ్చుకోవాల్సిందే. ప్రతీ ఫ్రేమ్ లోనూ ఆమె ప్యాషన్ కనిపిస్తుంది.

విశ్లేషణ: అక్కడక్కడా కొన్ని బోరింగ్ సన్నివేశాలను మినహాయిస్తే ఈ ‘నాట్యం’ క్లాస్ ఆడియెన్స్ నే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగల చిత్రమే..!

రేటింగ్: 3/5

Click Here To Read In ENGLISH

Share.