సూర్యకాంతం

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నీహారిక టైటిల్ పాత్ర పోషించిన చిత్రం “సూర్యకాంతం”. “ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి” వెబ్ సిరీస్ ల ద్వారా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రణీత్ తెరకెక్కించిన మొదటి ఫీచర్ ఫిలిమ్ ఇది. నవతరం ప్రేమకథగా తెరకెక్కబడిన ఈ చిత్రం ఇవాళ విడుదలైంది. ఇప్పటికీ రెండుసార్లు హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన నీహారిక కనీసం మూడో చిత్రంతోనైనా తాను కోరుకున్నది సాధించిందా లేదా అనేది చూద్దాం..!!

కథ: తనకు నచ్చినట్లు బ్రతకాలి అనుకునే మోడ్రన్ ఉమెన్ సూర్యకాంతం (నీహారిక కొణిదెల). 25 ఏళ్ళు వచ్చాయని పెళ్లి చేసుకోమని తల్లి (సుహాసిని) ఎంత చెప్పినా వినదు. తనకు ఇష్టమొచ్చినట్లు బ్రతకాలి అనుకుంటుంది. ఆ క్రమంలో అనుకోకుండా పరిచయమైన అభినవ్ (రాహుల్ విజయ్) తో ప్రేమ మొదలై ఒక తీరానికి చేరుకొనేలోపే అర్ధాంతరంగా ఆగిపోతుంది.

కట్ చేస్తే.. అభి లైఫ్ లోకి పూజ (పెర్లిన్) ఎంటరవుతుంది. ఆమెతో మరో నెలరోజుల్లో పెళ్ళికి సిద్ధమవుతుండగా.. అభి జీవితంలోకి మళ్ళీ సడన్ ఎంట్రీ ఇస్తుంది సూర్యకాంతం. ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి? చివరికి అభి ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అనేది “సూర్యకాంతం” కథాంశం.

నటీనటుల పనితీరు: మునుపటి సినిమాలతో పోల్చినప్పుడు నీహారిక కాస్త మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ.. ఆమె క్యారెక్టరైజేషన్ లో ఉన్న కన్ఫ్యూజన్ కారణంగా ఆమె పాత్ర చివరి వరకూ ఎవరికీ అర్ధం కాకుండానే ఉంటుంది. సాధారణంగా ఈ తరహా పాత్రలు హీరోలు చేసేవారు. కొత్తగా ఉంటుంది అనుకున్నారో ఏమో కానీ హీరోయిన్ తో చేయించారు.

రాహుల్ విజయ్ ఒక కన్ఫ్యూజ్డ్ యంగ్ మేన్ గా ఆకట్టుకున్నాడు. మనోడి క్యారెక్టర్ తోపాటు.. క్లైమాక్స్ కి కూడా ఒక అర్ధం ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పూజ పాత్రలో పెర్లెన్ మొదటీ సినిమా అయినా స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో శివాజీ రాజా పెద్దగా అలరించలేకపోయాడు. సత్య కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు, కొన్ని సింగిల్ లైన్ పంచ్ లు బాగున్నాయి.

సాంకేతికవర్గం పనితీరు: మార్క్ కె.రాబిన్ బాణీలు, నేపధ్య సంగీతం బాగున్నాయి. కాకపోతే.. ఆ పాటలకు కొరియోగ్రఫీ ఆకట్టుకొనే విధంగా లేదు. హరిప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి రొటీన్ కు భిన్నంగా ఆలోచించిన విధానం బాగుంది. క్లైమాక్స్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాడు. కానీ.. ఆ వైవిధ్యమైన క్లైమాక్స్ ను ఆడియన్స్ కు కన్విన్సింగ్ గా ఎక్స్ ప్లేన్ చేయడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తం నవ్వించాలో, ఎమోషనల్ గా డ్రైవ్ చేయాలో తెలియని కన్ఫ్యూజన్ లో నెట్టుకొచ్చేశాడు. ఆ కారణంగా ఫస్టావ్ అసలే ల్యాగ్ అనుకుంటే.. సెకండాఫ్ ఆ ల్యాగ్ ఇంకాస్త పెరిగింది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే.. అప్పుడెప్పుడో వచ్చిన “ఆవిడ మా ఆవిడే, అల్లరి మొగుడు” చిత్రాల మూలకథను గుర్తుకు చేసింది. పాత కథను, కొత్త క్యారెక్టరైజేషన్స్ తో సరికొత్తగా నడపాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ.. అలరించే కథనం లేనప్పుడు ఎన్ని జిమ్మీక్కులు చేసిన తిప్పికొడతాయనేది నవతరం దర్శకులు గమనించాల్సిన అవసరం చాలా ఉంది.

విశ్లేషణ: మెగా ఫ్యామిలీ మీద, ముఖ్యంగా నీహారిక మీద విపరీతమైన అభిమానం ఉంటే తప్ప “సూర్యకాంతం” చిత్రాన్ని థియేటర్ లో కూర్చుని రెండు గంటలపాటు చూడడం కాస్త కష్టమే.

రేటింగ్: 1/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus