టాలీవుడ్ లో పక్కా ప్లానింగ్ కి కేరాఫ్ అడ్రస్ దిల్ రాజు. సినిమా మొదలుపెట్టడానికంటే ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే నిర్మాత రాజు గారు. అలాంటిది ఈ మధ్య కాలంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్ లో మునుపటి జోరు కనిపించడం లేదు. స్టార్ హీరోల ప్రాజెక్టులు తగ్గించడమే కాకుండా, అనౌన్స్ చేసిన సినిమాలు కూడా పట్టాలెక్కకపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ‘ఎల్లమ్మ’ సినిమా క్యాస్టింగ్ కష్టాలు ఒకెత్తయితే, మరో సూపర్ హిట్ సీక్వెల్ విషయంలో నిర్మాత పాటిస్తున్న మౌనం ఇప్పుడు రకరకాల అనుమానాలకు తావిస్తోంది.
నిజానికి ఏడాది క్రితమే ‘శతమానం భవతి 2’ ఉంటుందని దిల్ రాజు గట్టిగా ప్రకటించారు. 2017 సంక్రాంతికి వచ్చి క్లాసిక్ హిట్ గా నిలిచిన ఆ సినిమాకు సీక్వెల్ గా, దీన్ని 2026 సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ ఆ ప్రకటన వచ్చి రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. షూటింగ్ మొదలవ్వలేదు సరికదా, అసలు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి.
ఈ ప్రాజెక్ట్ విషయంలో మొదటి నుంచే గందరగోళం ఉంది. ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ సతీష్ వేగేశ్నను పక్కన పెట్టి కొత్త దర్శకుడిని తీసుకున్నారని టాక్ వచ్చింది. అలాగే శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ రిపీట్ అవుతారా లేదా అనే దానిపై కూడా క్లారిటీ లేదు. ఇన్ని సందేహాల మధ్య దిల్ రాజు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ దాదాపు అటకెక్కినట్లేనని ఫిలిం నగర్ టాక్.
ప్రస్తుతం ఆడియన్స్ అభిరుచి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు ఆడినట్లు ఇప్పుడు ఆడటం లేదు. కంటెంట్ లో కొత్తదనం, లేదా భారీ యాక్షన్ ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. కేవలం సీక్వెల్ పేరు చెప్పుకుని రొటీన్ ఫ్యామిలీ కథతో వస్తే రిజల్ట్ తేడా కొడుతుందని రాజు గారు గ్రహించినట్లున్నారు. అందుకే రిస్క్ చేయడం ఇష్టం లేక ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ఫోకస్ అంతా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ మీదే ఉంది. అలాగే ‘ఎల్లమ్మ’ను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.