ఈ మధ్యకాలంలో భారీ సినిమాలకంటే చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలే ఎక్కువగా అలరిస్తున్నాయి. ఆ జాబితాలో కొత్తగా వచ్చి చేరిన చిత్రం “శ్వాగ్” (Swag) . హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు (Sree Vishnu), రీతూవర్మ (Ritu Varma) జంటగా రూపొందిన ఈ చిత్రం టీజర్ విడుదల సమయం నుంచి మంచి అంచానలను నమోదు చేస్తూ వస్తోంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలైంది. శ్రీ విష్ణు త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మిగతా పాత్రధారులందరూ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.
1551వ సంవత్సరంలో మొదలైన కథ 2024కు ఎలా కనెక్ట్ చేశాడు అనే విషయం ఆసక్తి రేకెత్తించగా.. శ్వాగణిక వంశానికి చెందిన కోట్ల రూపాయల నిధిని దక్కించుకోవడం కోసం శ్రీ విష్ణు & రీతూవర్మ ఎలా పోటీపడ్డారు అనేది కాన్ఫ్లిక్ట్ పాయింట్. దర్శకుడు హసిత్ గోలి (Hasith Goli) మార్క్ తెలుగు డైలాగులు, శ్రీ విష్ణు మార్క్ సగం సెన్సార్ చేసిన ద్వంద్వార్థ సంభాషణలు, వివేక్ సాగర్ స్థాయి నేపథ్య సంగీతంతో “శ్వాగ్” ట్రైలర్ చూడ్డానికి భలే ఆసక్తికరంగా ఉంది.
ఈ శుక్రవారం (అక్టోబర్ 4) ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా గనుక హిట్ అయితే.. కథానాయకుడిగా శ్రీవిష్ణు మొదటి హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నట్లే. “సామజవరగమన (Samajavaragamana) , ఓం భీమ్ బుష్ (Om Bheem Bush)” చిత్రాలు సాధించిన విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న శ్రీవిష్ణు “శ్వాగ్”తో హ్యాట్రిక్ హిట్ సాధించాడంటే మాత్రం టైర్ 2 హీరోలా జాబితాలో చేరిపోతాడు. ఇకపోతే.. “శ్వాగ్” పురుషాధిక్యత, మహిళా సాధికారత అనే రెండు సున్నితమైన అంశాలను కామెడీ జోనర్ లో తెరకెక్కించిన సినిమా.
ఏమాత్రం గీత దాటినా లేనిపోని గోల అవుతుంది. అయితే.. “రాజ రాజ చోర” (Raja Raja Chora) సినిమాతో దర్శకుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్న హసిత్ గోలి తెలుగులో బాగా ఫేమస్ అయిన “సెకండ్ సినిమా సిండ్రోమ్” (ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టి.. సెకండ్ సినిమాకి ఫ్లాప్ తో సరిపెట్టుకోవడం) నుండి తప్పించుకొంటాడో లేదో మరి!