‘బిగ్ బాస్’ ఫేమ్ సొహైల్ అందరికీ సుపరిచితమే. అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఆగస్టు 18న విడుదల కాబోతుంది. ఇప్పటివరకు టాలీవుడ్లో రానటువంటి జోనర్ లో ఈ సినిమా రూపొందింది. టీజర్, ట్రైలర్ వంటివి కొత్తగా ఉన్నాయి. మరి ఈ సినిమా గురించి సొహైల్ చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం రండి :
ప్ర) ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనేది చాలా రిస్కీ కాన్సెప్ట్.. ఇలాంటి సినిమా ఎందుకు చేయాలనుకున్నారు?
సోహెల్ : నేను బిగ్ బాస్ ద్వారా జనాలకి దగ్గరయ్యాను. నేను హీరోగా చేసినంత మాత్రాన జనాలు థియేటర్ కి ఎందుకు వస్తారు? ఆ డౌట్ నాకు మొదటి నుండి ఉంది. అది నిజం కూడా..! కమర్షియల్ సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఉన్నారు. లవ్ స్టోరీస్ చేయడానికి నాని, విజయ్ దేవరకొండ వంటి వారు ఉన్నారు. నేను కూడా వాళ్ల మాదిరి సినిమాలు చేస్తే జనాలు ఎందుకు థియేటర్ కి వస్తారు? అందుకే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ వంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకున్నాను.
ప్ర) డైరెక్టర్ శ్రీనివాస్ మొదట ఈ కథ మీకు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
సోహెల్ : ఆయన నాకు ఎనిమిదేళ్లుగా ఫ్రెండ్.ఆయన వయసు 43 కానీ బయటకు చెప్పడు(నవ్వుతూ) చాలా యంగ్ గా కనిపిస్తాడు. మొదట ఈ కథని వేరే పెద్ద హీరోతో చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే ఇద్దరికీ ఇమేజ్ లేదు. అలాంటప్పుడు మేము చేస్తే సినిమా వర్కౌట్ అవ్వదు అన్నాడు. నాకు ఫలానా హీరో మేనేజర్ తెలుసు కదా.. రిఫర్ చేయొచ్చు కదా అనేవాడు. నాకు కోపం వచ్చేది. నన్ను పెట్టుకుని ఎందుకు వేరే హీరోని అడుగుతున్నాడు అని..! అంత ఎమోషనల్ కంటెంట్ ఇందులో ఉంది.
ప్ర) ఇలాంటి పాత్ర చేయడం బరువైనది అనిపించలేదా?
సోహెల్ : రెండు రకాలుగా చాలా బరువైన పాత్ర ఇది(నవ్వుతూ). మూడున్నర కేజీల బరువు మోసేవాడిని. మేల్ ప్రెగ్నెంట్ గా నటించడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు ఇద్దరు సిస్టర్స్. నేను ఈ సినిమా ఒప్పుకునే టైంకి వాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నారు. వాళ్లు ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా పనులు చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే నాకు ఏదో తెలియని ఎమోషన్. అలాంటి టైంలో కథ విన్నాక శ్రీనివాస్ గారికి థాంక్స్ చెప్పాను. వాస్తవానికి ఆయన నాకు వేరే కథ కూడా చెప్పాడు. కానీ ఈ కథే చేస్తాను అని నేను పట్టుబట్టి చేశాను.
ప్ర) ఇది సృష్టికి విరుద్ధమైన కాన్సెప్ట్ అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటివి మీరు షూటింగ్ చేసినప్పుడు ఏమైనా ఫేస్ చేశారా?
సోహెల్ : సినిమా అంటేనే ఒక ఫిక్షన్. నిజ జీవితానికి సంబంధం లేని ప్రపంచాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే.. దీని ప్రధాన ఉద్దేశం. ‘అవతార్’ అనేది ఒక సృష్టి. ‘స్పైడర్ మెన్’ ఒక సృష్టి. అంతెందుకు ఓ హీరో కొడితే నలుగురు ఎగిరి పడిపోవడం అనేది కూడా లాజిక్ కి అందనిదే..! అదంతా కూడా సృష్టికి విరుద్ధమైనదే. కానీ సినిమా అనే వరల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు ప్రేక్షకులు అవన్నీ పక్కన పెట్టేయాలి.
ప్ర) ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయ్యింది?
సోహెల్ : దాదాపు రూ.7 కోట్ల వరకు నిర్మాత ఖర్చు చేశారు. నేను (Syed Sohel) తప్ప అందరూ ఎంతో కొంత ఇమేజ్ సంపాదించుకున్న వాళ్ళే..! నాకు మార్కెట్ ఇంకా ఏర్పడలేదు. ఈ సినిమాపై నాకు నమ్మకం ఉంది. నా కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది అని..!
ప్ర) నిర్మాతల గురించి చెప్పండి?
సోహెల్ : ఈ సినిమాకి అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జ నిర్మాతలయ్యారు కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళు అయితే నా పై పోలీస్ కేసు పెట్టేవారు. సినిమాపై వీళ్ళకి ఉన్న ప్యాషన్ వల్ల.. మొదటి సినిమా నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంపిక చేసుకుంటున్నారు. వాళ్ళ ‘జార్జి రెడ్డి’ సినిమా నుండీ కూడా నాలాంటి కొత్త వాళ్లనే ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. అది వాళ్ళ గొప్పతనం.
ప్ర)మొదట ఈ కథని విశ్వక్ సేన్ కోసం అనుకున్నారట?
సోహెల్ : నిజమే..! ఆ టైంకి నేను ‘బిగ్ బాస్’ లో ఉన్నాను. డైరెక్టర్ శ్రీనివాస్ గారు నాని, విశ్వక్ సేన్ ల కోసం ట్రై చేశారు. కానీ నాకే (Sohel) రాసిపెట్టి ఉంది ఈ కథ.
ప్ర) ఈ సినిమా విడుదల చాలా ఆలస్యం అయినట్టు ఉంది కదా?
సోహెల్ : అవును..! చాలా లేట్ అయ్యింది. కానీ ఇది రైట్ టైంలో వస్తుంది అని నేను అనుకుంటున్నాను.
ప్ర) ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ను ముందుగా ఎవరికైనా చూపించారా?
సోహెల్ : చూపించాం.. నిన్న .. 200 మంది ప్రెగ్నెంట్ లేడీస్ కి షో వేసి చూపించాం. వాళ్ళ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్లైమాక్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.
ప్ర) మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి?
సోహెల్ : ప్రస్తుతం ‘బూట్ కట్ బాలరాజు’ షూటింగ్ జరుగుతుంది. ‘కథ వేరే ఉంటది’ అనే మరో సినిమా కూడా చేస్తున్నాను. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానాలా మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయాలని ఉంది.