ఆమిర్ ఖాన్ సినిమా ‘తారే జమీన్ పర్’ సినిమా గుర్తుందా? ఎందుకు గుర్తులేదు అందులో ఓ చిన్న కుర్రాడు అదరగొట్టేశాడు అని అంటారా? అవును, నిజమే.. ఆ కుర్రాడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమా ప్రత్యేక బాలుడిగా కనిపించిన దర్శిల్ ఇప్పుడు హీరో అయిపోయాడు. అతన్ని ప్రధాన పాత్రధారుడిగా చేస్తూ అమెజాన్ ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించింది. అమెజాన్ మినీ టీవీలో ఈ ఫిల్మ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
‘తారే జమీన్ పర్’ సినిమాలో దర్శిల్ సఫారీ నటనకు చాలామంచి పేరు వచ్చింది అని చెప్పాలి. చదువుల్లో వెనుకబడిన విద్యార్థిగా దర్శిల్ నటన ఎంతో ఆకట్టుకుంది. మట్టిలో మాణిక్యం లాంటి ఆ అబ్బాయిని అమీర్ ఖాన్ సానబట్టి మెరిసే వజ్రంలా మార్చే తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ కుర్రాడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. రేవతి పిళ్లై అనే యువతితో కలసి ’క్యాపిటల్ ఎ స్మాల్ ఎ’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. ‘క్యాపిటల్ ఎ స్మాల్ ఎ’ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఇప్పుడు ఆ ఫిల్మ్‌కి కూడా మంచి ఆదరణ దక్కుతోంది. ఆదిగా దర్శిల్, ఆంషిగా రేవతి మధ్య నడిచే ఈ యుక్త వయసు ప్రేమకథ అదిరిపోయింది అని చెబుతున్నారు. ఫస్ట్ క్రష్ కాన్సెప్ట్‌లో ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందింది. యువతలోని అభద్రతా భావాలు, భయాలు వారిని ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాలు ఈ చిత్రంలో చూపించారు .
ఇక దర్శిల్ సఫారీ అయితే జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి వాళ్లతో పని చేయాలని ఉంది అని చెబుతున్నాడు. చిన్నప్పుడు ఇషాన్ అవాస్తిగా అదరగొట్టిన దర్శిల్ ఇప్పుడు ఆదిగా వచ్చాడు. త్వరలో వెండితెరపై ఫుల్ సైజ్ హీరోగా వస్తాడు. ఈలోపు ఈ మిస్టరీ బాయ్ షార్ట్ ఫిల్మ్ చూసేయండి. అంతకుముందు దిగువ ట్రైలర్‌పై లుక్కేయండి.