“మహేష్ బాబు, రణబీర్ కపూర్‌లలో ఎవరు బెస్ట్ రాముడు?” అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. కానీ ఈ పోలిక చూస్తుంటే.. వీళ్లిద్దరూ రాముడి పాత్ర చేస్తున్నారన్న మాటే గానీ, ఆ రెండు ప్రాజెక్టుల స్వభావం, ఆ పాత్రల పరిధి పూర్తిగా వేరు. అనవసరంగా ఫ్యాన్స్ లేనిపోని డిస్కషన్లు పెట్టుకుని టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు.
MAHESH BABU
క్లియర్‌గా చెప్పాలంటే.. రణబీర్ కపూర్ చేస్తున్నది ‘రామాయణం’. అంటే పుట్టుక నుంచి పట్టాభిషేకం వరకు సాగే పూర్తి కథ. సినిమా మొత్తం రణబీర్ భుజాల మీదే నడుస్తుంది. కానీ మహేష్ బాబు ‘వారణాసి’లో చేస్తున్నది అది కాదు. అదొక అడ్వెంచర్ సినిమా. అందులో రాముడి పాత్ర కేవలం ఒక ఎపిసోడ్ లేదా ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే అద్భుతమైన మెరుపు మాత్రమే. అంటే ఒకరు పూర్తి స్థాయి సినిమాను మోస్తుంటే, మరొకరు సినిమాకు ఆయువుపట్టులాంటి పాత్రలో కనిపిస్తున్నారు. నిడివిలో, కథనంలో ఇంత తేడా ఉన్నప్పుడు పోలిక ఎలా సాధ్యం?
ఇక్కడ హీరోల కంటే దర్శకుల విజన్ గురించే ఎక్కువ మాట్లాడుకోవాలి. గతంలో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ రాముడిగా చేసినా ‘ఆదిపురుష్’ విఫలమైంది. కారణం.. దర్శకుడి లోపం. ఇప్పుడు రణబీర్ గెలిచినా, మహేష్ మెప్పించినా ఆ క్రెడిట్ నితేష్ తివారీ, రాజమౌళిలకే దక్కుతుంది. రాజమౌళి కేవలం 10 నిమిషాలు చూపించినా, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాగే నితేష్ తివారీ ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట. కాబట్టి ఎవరి బలం వారిది.
నిజానికి ఇది గొడవ పడాల్సిన విషయం కాదు, సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఒకేసారి ఇద్దరు భారీ స్టార్లు, మన ఇతిహాస నాయకుడి పాత్రలో కనిపించడం అరుదైన విషయం. రణబీర్ ద్వారా పూర్తి రామాయణాన్ని చూస్తాం, మహేష్ ద్వారా రాజమౌళి మార్క్ ఎలివేషన్‌ని చూస్తాం. ఎవరి మ్యాజిక్ వారిదే. కాబట్టి ఈ ‘ఎవరు బెస్ట్’ అనే చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిది. ఎన్టీఆర్ నుంచి బాలయ్య వరకు ఎంతోమంది రాముడిగా మెప్పించారు. ఇప్పుడు ఈ తరం స్టార్స్ వంతు వచ్చింది. ఇద్దరూ హిట్ కొడితే, అంతిమంగా గెలిచేది మన ఇండియన్ సినిమానే.
