సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రోల్ పోషించడం స్టార్ హీరోలకు సైతం కష్టం. అందుకే అతని కథల జోలికి, రోల్స్ జోలికి వెళ్లరు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సైతం రోబో సీక్వెల్ లో నటించమని శంకర్ కోరితే రజనీకాంత్ లా నటించడం తన వల్ల కాదని వద్దన్నారు. అటువంటిది తమన్నా రజనీకాంత్ పోషించిన రోబో రోల్లో మెరిసింది. ఏ సినిమాలో అనుకుంటున్నారా? సినిమాలో కాదు టీవీ షోలో. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ‘లిప్ సింగ్ బ్యాటిల్’ అనే టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొని ఇతర స్టార్స్ గెటప్‌లో వారిని అనుకరించడమే ఈ షో కాన్సెప్ట్. ఈ షోలో ఇప్పటివరకు శిల్పా శెట్టి, ఫర్హాన్ అక్తర్, అర్జున్ కపూర్ తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు. తాజాగా ఈ షోలో తమన్నా పాల్గొంది. ఆమె ఏకంగా రజనీకాంత్ రోబో గెటప్‌ను వేసింది. స్టేజీ మీద అదరగొట్టింది. ఆ ఫోటోని సైతం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. “నాకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా నిలిచిన రజనీకాంత్‌కి ఇది నా ట్రిబ్యూట్. నా జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి క్లిష్టమైన పాత్రలో నటించలేదు.” అని ట్వీట్ చేసింది. ఫోటోకి, తమన్నా కామెంట్ అత్యధికంగా లైక్స్, షేర్స్ వస్తున్నాయి.