‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ కు ‘లైగర్’ చిత్రం చాలా డిజప్పాయింట్ చేసింది. ఈ సినిమా కొనుగోలు చేసిన బయ్యర్లు రెండింతలు నష్టపోయారు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ దర్శకుడు పూరి పై ఒత్తిడి పెంచారు. నష్టపరిహారం చెల్లించకపోతే దర్శకుడు పూరి ఇంటి ముందు ధర్నా చేస్తాం అంటూ వారు పూరికి నాన్ స్టాప్ గా ఫోన్లు చేయడం, లేఖ కూడా పంపి బెదిరించడంతో పూరి వీరి పై ఫైర్ అయ్యాడు.
బయ్యర్స్ నష్టపోయిన దాంట్లో కొంత భాగం నష్టపరిహారంగా చెల్లిస్తాను అని చెప్పినా వినకుండా నా పరువుకు భంగం కలిగిస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటూ సహనం కోల్పోయి పూరి పంపిన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం, అది పెద్దగా వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో పూరికి సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ.. ” పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘నేనింతే’ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇదే విధంగా ధర్నాకు దిగారు.
ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ వివాదం సద్దుమణిగింది. ఇక ‘లైగర్’ విషయానికి వస్తే.. పూరీ మాటల్లో ధర్మం ఉంది. ఆయన ఎవరి వద్దకు వెళ్లి మా సినిమాని కొనుక్కోండి అని కోరలేదు. వాళ్ళే వచ్చి సినిమాని కొనుక్కున్నారు. విజయ్ దేవరకొండ గత చిత్రాల వసూళ్లను దృష్టిలో పెట్టుకుని ‘లైగర్’ సినిమా హక్కులను కొనుగోలు చేయాలి.వాళ్ళు అలా చేయలేదు. ఎక్కువ రేట్లు నాకు తెలిసి డబుల్ రేట్లు పెట్టి ‘లైగర్’ హక్కుల్ని కొన్నారు.
కాబట్టి తప్పు వాళ్ళదే.! న్యాయంగా చూసుకుంటే.. పూరీ ఒక సినిమాతో మార్కెట్లోకి వచ్చాడు. ఒక రేటు చెప్పి.. దాన్ని అమ్మాడు. ఆయన చెప్పిన ధరకు ఓకే చెప్పే బయ్యర్స్ కొనుగోలు చేశారు. ఇప్పుడు మేము నష్టపోయాం, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడగడం కరెక్ట్ కాదు. అలా అనడం ఎందుకు? అంత మొత్తంలో సినిమాను కొనుగోలు చేసేటప్పుడు ఆలోచిస్తే బాగుండేది” అంటూ తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.