నటుడుగా,రచయితగా.. ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు తనికెళ్ళ భరణి. నెగిటివ్ రోల్ లో అయినా… కామెడీ రోల్ అయినా.. తండ్రి పాత్రైనా… సహాయ నటుడి పాత్రకైనా.. వందకు వంద శాతం న్యాయం చేస్తారు తనికెళ్ళ భరణి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దర్శకుడిగా కూడా ‘మిధునం’ అనే చిత్రాన్ని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారాయన. గతంలో ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేస్తూ శివుడి గురించి అనేక పద్యాలను .. పాటలను రాశారు తనికెళ్ళ భరణి. స్టార్ హీరోలందరితోనూ పనిచేసిన ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ… “పవన్ ‘బాలు’ సినిమా చేస్తున్న రోజులవి. ఆ చిత్రంలో నేను ఓ వేషం వేశాను. షూటింగు షాట్ గ్యాపులో పవన్ కళ్యాణ్ కారవ్యాన్ లో వున్నారు. ఆయన అసిస్టెంట్ తో కబురు చేసి నేను వెళ్ళి ఆయనను కలిశాను. నేను రాసిన ‘నాలోన శివుడు గలడు’ అనే పాటల సీడీని పవన్ కి ఇచ్చేసి వచ్చేశాను. మరుసటి రోజు నేను సెట్ కి వెళ్ళగానే… పవన్ నుంచి కబురు వచ్చింది. నేను ఆయన కార్ వ్యాన్ లోకి వెళ్ళిన వెంటనే ఆయన నన్ను గట్టిగా హత్తుకున్నారు. ‘శివుడి గురించి మీరు రాసిన పాటలు విన్నాను .. ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఈ రోజు షూటింగుకి కూడా రావాలనిపించలేదు .. చాలా బాగా రాశారు’ అంటూ నన్ను అభినందించారు. ఆ రోజు నేను ఎప్పటికీ మరిచిపోలేను” అంటూ చెప్పుకొచ్చారు.