గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఘజినీ మహమ్మద్ రేంజ్ లో వరుస సినిమాలతో ప్రేక్షకులపై దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు ఆది సాయికుమార్. ఆ దండయాత్రలో భాగంగా ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం “తీస్ మార్ ఖాన్”. ట్రైలర్ కాస్త ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ.. ఆది సాయికుమార్ మునుపటి చిత్రాల పుణ్యమా అని ఈ సినిమాపై ప్రేక్షకులకు ఎలాంటి అంచనాలు లేకుండాపోయాయి. మరి ఆది ఈ సినిమాతోనైనా విజయం సాధించాడో లేదో చూద్దాం..!!
కథ: పుట్టుకతో అనాధ అయిన తీస్ మార్ ఖాన్ (ఆది సాయికుమార్)ను చేరదీస్తుంది వాసు (పూర్ణ). ఇద్దరూ కలిసి పెరుగుతారు. వాసుని తల్లిగా భావిస్తాడు తీస్ మార్ ఖాన్. ఊహించని విధంగా వాసు చంపబడుతుంది. ఆమె చావు వెనుక ఉన్నది ఎవరో కనుక్కునే ప్రయత్నంలో తీస్ మార్ ఖాన్ కొందరు వ్యక్తుల్ని ఎదిరిస్తాడు. అసలు వాసుని హత్య చేసింది ఎవరు? ఆమె హత్య వెనుక ఉన్న కథ ఏమిటి? తీస్ మార్ ఖాన్ ఈ రహస్యాన్ని ఎలా చేధించాడు? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా ఆది సాయికుమార్ కి అర్జెంట్ గా బ్రేక్ కావాలి అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా ఇది. వరుస బెట్టి సినిమాలు చేస్తుండడంతో కనీస స్థాయి వేరియేషన్స్ చూపించడం మర్చిపోయాడు. కాస్త కొత్తగా కనిపించాడు తప్పితే.. సినిమాలో ఎక్కడా సన్నివేశానికి తగిన ఎమోషన్ పలికించలేకపోయాడు. అసలే సినిమాలో కథ లేదేంటి అని జుట్టు పీక్కునే ప్రేక్షకుడు..
నటీనటులను చూసి ఇంకాస్త చిరాకుపడతాడు. సినిమాకి కావాల్సినంత గ్లామర్ ను పాయల్ యాడ్ చేసినప్పటికీ.. సదరు గ్లామర్ ను అంతలా ఎంజాయ్ చేసే మూడ్ లో ఆడియన్స్ ఉండరు. ఇక లెక్కకు మిక్కిలి ఆర్టిస్టులు, విలన్లు పుష్కలంగా ఉన్న సినిమాలో ఒక్కటంటే ఒక్క క్యారెక్టర్ కూడా రిజిష్టర్ అవ్వదు.
సాంకేతికవర్గం పనితీరు: సాయికార్తీక్ బాణీలు, ఎం.ఎన్.బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సోసోగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ వీక్ అని చెప్పడానికి ఇవి పెద్ద ఉదాహరణలు. ఇక కాస్ట్యూమ్స్ & ఆర్ట్ వర్క్ చాలా పేలవంగా ఉన్నాయి. దర్శకుడు కళ్యాణ్ జి ఒక సాధారణ కథను కమర్షియల్ అంశాలు జోడించి ఆడియన్స్ ను అలరించడానికి చేసిన విఫలప్రయత్నం చూసి నెత్తి కొట్టుకోవడం తప్ప చేసేదేమీ లేదు. ప్రెజంట్ ట్రెండ్ లో ఎంత చిన్న కథ అయినా.. ఎంత ఆసక్తికరంగా చెప్పారు అనే విషయం చాలా కీలకం.
కానీ.. దర్శకుడు ఆ విషయాలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. కామెడీ, ఫైట్లు, హీరోయిన్ గ్లామర్, బోలెడు మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఇలా సినిమాకి కావాల్సిన చాలా అంశాలు పుష్కలంగా ఉన్నా.. సదరు అంశాలను మలిచిన తీరులో మేటర్ లేకపోవడంతో.. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
విశ్లేషణ: ఒకపక్క “సీతారామం, బింబిసార, కార్తికేయ” లాంటి బ్లాక్ బస్టర్స్ తో తెలుగు చిత్రసీమ కళకళలాడుతుండగా.. మధ్యలో “మాచర్ల నియోజకవర్గం, తీస్ మార్ ఖాన్” లాంటి సినిమాలు ఆ విజయపరంపరను కొనసాగించలేక చతికిలపడ్డాయి.
రేటింగ్: 1.5/5
Click Here To Read in ENGLISH