నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడు అనేది పాత విషయం. దీనికి సంబంధించిన పనులు చాలా ఏళ్లుగా సాగుతున్నాయి అనేది కూడా పాత విషయమే. ఎప్పుడు మొదలవుతుందో తెలియదు అనేది కూడా పాత విషయమే. అయితే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే.. తనయుడు కంటే ముందు తనయ నటి కాబోతున్నారట. అవును నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ముఖానికి రంగేసుకోబోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని సమాచారం. అయితే అది సినిమా కోసం కాదు. ఓ యాడ్ కోసం..
ఓ జ్యువెలరీ కంపెనీ యాడ్ కోసం తేజస్విని తొలిసారి కెమెరా ముందుకు రానున్నారు. ఇప్పటివరకు తండ్రి సినిమాలకు సంబంధించిన పనులు చూసుకునే తేజస్వినిని ఇటీవల ఓ సంస్థ కాంటాక్ట్ అయిందట. అందులో బాలకృష్ణ కూడా నటిస్తున్నారు అని సమాచారం. ఇద్దరూ ఆ యాడ్‌లో తండ్రీకూతుళ్లుగా కనిపిస్తారని తెలుస్తోంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అయితే ఆ యాడ్ షూటింగ్ కూడా అయిపోయిందని భోగట్టా. అయితే ఇదే ఊపులో సినిమాల్లోకి కూడా వస్తారేమో చూడాలి.
ఈ విషయంలో అభిమానులు ఆనందంగానే ఉన్నా.. మోక్షజ్ఞ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే ఆయన తొలి సినిమా అనౌన్స్ చేసి ఏడాది పూర్తయింది. ఇదిగో ప్రారంభం, అదిగో ప్రారంభం అంటూ ముహూర్తాలు కూడా పెట్టేశారు. కానీ ఆ రోజు ఏదో అనారోగ్యం కారణంగా ముహూర్తం జరపలేదు అని చెప్పారు. ఇప్పటివరకు ఆ సినిమా మొదలవ్వలేదు. ఈ లోపు ఆ సినిమా అనౌన్స్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇతర సినిమాల పనుల్లో బిజీ అయిపోయారు.
ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ పేరు చర్చలోకి వచ్చింది. ఆయన డైరక్షన్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’ సినిమా తెరకెక్కుతుందని.. దాంతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో కూడా ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. చూడాలి మరి మోక్షజ్ఞ ఎంట్రీకి మోక్షం ఎప్పుడో?