బాలయ్య (Balakrishna) నటించిన మొదటి సినిమా “తాతమ్మ కల” థియేటర్లలో విడుదలై ఆగస్ట్ 30కి 50 ఏళ్లు పూర్తవుతుండడంతో.. సెప్టెంబర్ 1న తెలుగు ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి “బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలు” అంటూ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సీనియర్ హీరోలు, యువ హీరోలు, దర్శకులు, సీనియర్ నటీమణులు, నిర్మాతలు పాల్గొన్నారు. చాలా ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కు పరభాషా నటులు కూడా హాజరయ్యారు. అన్నీ ఇండస్ట్రీలు ఈ ఈవెంట్ గురించి గొప్పగా చెప్పుకున్నాయి, అంతా బానే ఉంది కానీ..
ఈ స్థాయిలో కాకపోయినా కనీసం తెలుగు ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి స్వర్గీయ ఎస్పీ.బాలసుబ్రమణ్యం (S. P. Balasubrahmanyam) సంస్మరణ సభ ఎందుకు నిర్వహించలేకపోయారు? నిజానికి బాలు మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. అన్నీ భారతీయ భాషల్లో పాటలు పాడిన బాలుకి తమిళ ఇండస్ట్రీ పెద్దలు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. 74 ఏళ్ల వయసులో కరోనా వచ్చిన తర్వాత రికవర్ అవుతూ దివంగతులైన బాలు హాస్పిటల్ ఫీజు క్లియరెన్స్ విషయంలో సైతం రకరకాల అపోహలు చెలరేగగా..
ఆయన కుమారుడు చరణ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇవ్వాల్సి వచ్చిన సందర్భం విదితమే. అయితే.. అంత హడావుడి జరిగిన తరుణంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు దీర్ఘకాలిక మౌనం పాటించారు. ఒక యూట్యూబ్ లైవ్ లో కొందరు మాత్రం పాల్గొని తమ అనుబంధం పంచుకొని మిన్నకుండిపోయారు. ఆయన మరణం అనంతరం, కరోనా ఉధృత తగ్గిన తర్వాతైనా కనీసం ఓ సంస్మరణ సభ సైతం నిర్వహించలేదు. బాలయ్యకు (Balayya Babu) చేసినట్లుగా భారీ స్థాయి ఈవెంట్ చేయనక్కర్లేదు.
కనీసం ఇండస్ట్రీలో ఆయనతో పాటలు పాడించుకున్న సంగీత దర్శకులు, హీరోలు, నిర్మాతలు కలిసి.. ఫిల్మ్ ఛాంబర్ లో అయినా ఓ చిన్నపాటి సంస్మరణ సభ నిర్వహించి ఉంటే బాగుండేది. కనీసం వచ్చే జూన్ లో అయినా ఆయన పుట్టినరోజు సందర్భంగా జయంతి వేడుకలను కాస్త ఘనంగా నిర్వహించి.. తెలుగు సినిమా ఇండస్ట్రీగా తెలుగు సింగర్, ప్రొడ్యూసర్, యాక్టర్ అయిన ఎస్పీబీ విషయంలో చేసిన తప్పును సరిదిద్దుకుంటుందో లేదో చూడాలి!