వరుస పరాజయాలతో సందీప్ కిషన్ కెరీర్ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. ఆ కెరీర్ ను కాస్త చక్కదిద్దుకొనే ప్రయత్నంలో మాస్ ఇమేజ్ కు దూరంగా జరిగి కామెడీ జోనర్ లో హిట్ కొట్టాలనుకొన్నాడు. మరి నాగేశ్వర్రెడ్డి కామెడీ సినిమా సందీప్ కెరీర్ కు ఏమేరకు హెల్ప్ అయ్యిందో చూద్దాం..!!
కథ: తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ఓ చెట్టు కింద ప్లీడరు. కేసు ఇచ్చే నాధుడు లేక, కోర్టులో ఒక్కసారైనా జడ్జ్ ముందు వాదించాలని చూస్తుంటాడు. కర్నూలులో పలుకుబడి కలిగిన వరలక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్)పై ఓ తప్పుడు కేస్ మోపబడుతుంది. ఆ కేస్ ను టేకప్ చేసి విజయం సాధిస్తాడు కానీ.. తాను కాపాడిన వరలక్ష్మి తాను అనుకుంటున్నట్లు అంత మంచిది కాదని తెలుసుకొంటాడు.
ఇంతకీ వరలక్ష్మి ఆ హత్య కేసులో నిజంగానే ఇరికించబడింగా? ఈ హత్య వెనుక రహస్యం ఏమిటి? అనేది “తెనాలి రామకృష్ణ” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: తనకు తెలిసిన కామెడీని సందీప్ కిషన్ బాగానే పండించాడు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోయాడు. పైగా.. చాలా సన్నివేశాల్లో డబ్బింగ్ అస్సలు సింక్ అవ్వలేదు. కొన్ని సన్నివేశాలకు డైలాగ్ రీప్లేస్ మెంట్స్ ఆఖరి నిమిషంలో జరగడం కారణంగా డబ్బింగ్ స్టూడియోలో కాక ఫోన్ లోనో లేక ఆడియో రికార్డర్ లోనో రికార్డ్ చేసిన వాయిస్ ను యాడ్ చేశారు. ఆ ప్యాచ్ లు సరిగా సింక్ అవ్వలేదు.
హన్సిక సన్నబడిన తర్వాత తెలుగులో నటించడం ఇదే అనుకుంటా.. స్క్రీన్ మీద సందీప్ కంటే పెద్దదానిలా కనిపించడమే కాక.. మునుపటి చార్మ్ పోయి గ్లామరస్ గా కూడా కనిపించలేదు. ఈమె డైలాగ్స్ కి కూడా ఎక్కడా లిప్ సింక్ లేకపోవడం గమనార్హం.
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు డెబ్యూకి తన ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం ప్లస్ పాయింట్. ఆమె క్యారెక్టర్ కు డిఫరెంట్ షేడ్స్ ఉన్నప్పటికీ.. వాటిని దర్శకుడు సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు.
సప్తగిరి, ప్రభాస్ శ్రీనుల కామెడీ సోసోగా ఉంది కానీ.. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం మరీ బీగ్రేడ్ స్థాయిలో ఉన్నాయి.
సాంకేతికవర్గం పనితీరు: సాయి కార్తీక్ బాణీలు పర్వాలేదు అనిపించేలా ఉన్నా.. సాహిత్యం సరిగా సహకరించలేదు. అందువల్ల పాటలు అర్ధం కాక ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోడు. నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉంది. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ & కాస్ట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.
దర్శకుడు నాగేశ్వర్రెడ్డి సినిమాల్లో లాజిక్స్ అనేవి చూడకూడదు అని ఆయన మునుపటి సినిమాలు చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది. కానీ.. లాజిక్స్ లేని కామెడీ పండాలంటే మంచి కథ-కథనం కూడా ఉండాలి అనే విషయాన్ని కూడా నాగేశ్వర్రెడ్డి విస్మరించినట్లున్నారు. క్యారెక్టరైజేషన్స్ కానీ, కథనం కానీ ఆకట్టుకొనే స్థాయిలో లేవు. ఇక ట్విస్టులను కూడా సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు దర్శకుడు. లాజిక్స్, సెన్సిబిలిటీస్ అనేవి కామెడీ సినిమాలకు అవసరం లేనివి అని ఇంకా 90ల కాలంలోనే ఉండిపోయారు మేకర్స్. కానీ.. ప్రెజంట్ జనరేషన్ కి సినిమా నచ్చాలంటే కామెడీ సినిమా అయినా సరే కనీస స్థాయి లాజిక్స్ & సెన్సిబిలిటీస్ ఉండాలి అనే విషయాన్ని గుర్తించాలి.
విశ్లేషణ: హిట్ కొట్టాలనే సందీప్ కిషన్ కోరిక “తెనాలి రామకృష్ణ” సినిమాతో తీరనట్లే. అతడి కోరిక తీరి.. మంచి విజయం సాధించాలంటే కథల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ముందుగా సేఫ్ జోన్ లో ఉండిపోయి ఇలాంటి సినిమాలు కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేసే ఛాన్స్ ఉన్న సందీప్ కూడా మాస్ హీరో ఇమేజ్ కోసం వెంపర్లాడడం అనేది కడు శోచనీయం.