తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ గా రూపొందిన సినిమా ‘తలైవి’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రెండు వారాలు తిరిగేసరికి ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కరోనా పరిస్థితులను సవాల్ గా తీసుకొని థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకి మంచి రివ్యూలే వచ్చాయి. థియేటర్లలో ఈ సినిమాను ఎంతమంది చూశారో కానీ.. ఇంతలోనే ఓటీటీలోకి వచ్చేసింది. రెండు వారల గడువుతో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేశారు.
ప్రస్తుతం ఇంతకుమించి కూడా మూవీ మేకర్లు చేయగలిగింది లేదేమో. థియేటర్లలో పూర్తి స్థాయిలో వసూళ్లను రాబట్టుకునే రోజులు ఇంకా రాలేదు. బాక్సాఫీస్ వసూళ్లపై ఆశలు పెట్టుకున్న మాస్ మూవీలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేరుకి థియేటర్లలో విడుదల చేసే ‘తలైవి’తో ప్రయోగమే చేశారు. అయితే త్వరగా ఓటీటీలో విడుదల చేసేందుకు కూడా ఒప్పందం చేసుకున్నట్లుగా ఉన్నారు. రెండు వారాల్లోనే కాబట్టి ఈ సినిమాకు ఓటీటీలో కూడా మంచి రేటే పలికి ఉండొచ్చు.
అటు ప్రయోగాత్మకంగా బాక్సాఫీస్ వద్ద ఎంతో కొంత రాబట్టుకొని.. వెంటనే ఓటీటీలో విడుదల ద్వారా మంచి రేటుకే అమ్ముకునే ప్రయత్నం చేసినట్లుగా ఉన్నారు.