తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేశారు. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఒక గుర్తింపు చిహ్నాన్ని కేటాయించింది. దశాబ్దాలుగా వెండితెరపై విజిల్స్ వేయించిన విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే ‘విజిల్’ గుర్తుతో ఓటర్ల ముందుకు వెళ్లబోతున్నారు. ఈ మేరకు ఈసీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
విజయ్ గతంలో నటించిన ‘బిగిల్’ సినిమా తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఫుట్‌బాల్ కోచ్‌గా ఆయన వేసిన విజిల్స్ ఎంతలా అలరించాయో, ఇప్పుడు అదే పార్టీ గుర్తుగా రావడం ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది. తమ పార్టీకి గుర్తు కేటాయించాలని కోరుతూ గతేడాది నవంబర్ 11న టీవీకే బృందం ఈసీని సంప్రదించింది. అందుబాటులో ఉన్న ఫ్రీ సింబల్స్‌తో పాటు తాము సొంతంగా డిజైన్ చేసిన విజిల్, ఆటో, మైక్ వంటి గుర్తులను వారు ప్రతిపాదించగా, చివరికి ‘విజిల్’ కేటాయించబడింది.
మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా తన ‘మక్కల్ నీది మయ్యమ్’ (MNM) పార్టీ గుర్తును ఖరారు చేసుకున్నారు. ఈసీ ఆయనకు పాత గుర్తు అయిన ‘బ్యాటరీ టార్చ్’ నే మళ్లీ కేటాయించింది. 2019 లోక్‌సభ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమల్ ఇదే గుర్తుతో బరిలోకి దిగారు. ప్రస్తుతం కమల్ హాసన్ అధికార డీఎంకే కూటమితో పొత్తులో ఉండగా, విజయ్ మాత్రం సోలోగానే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఫిక్స్ అయ్యారు.
తమిళ రాజకీయాల్లో సినిమా నటుల ప్రాభవం ఎప్పుడూ ఎక్కువే. ఎంజీఆర్, శివాజీ గణేశన్ నుంచి విజయకాంత్ వరకు ఎందరో తమ ముద్ర వేశారు. ఇప్పుడు విజయ్ ‘విజిల్’ వేస్తూ ప్రజాక్షేత్రంలోకి దూసుకువెళ్తుంటే, కమల్ తన ‘టార్చ్’ వెలుగులో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరి ఎంట్రీతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా రసవత్తరంగా మారనున్నాయి.