టాలీవుడ్‌లో వరుస హిట్లు అందుకుంటున్న సంగీత దర్శకుడు ఎవరు అంటే ఠక్కున తమన్ అని చెప్పేస్తారు. అంతలా తన సంగీతంతో సినిమాను అదరగొట్టేస్తున్నారు. ఇటు పాటలు, అటు నేపథ్య సంగీతంతో సినిమాలను అమాంతం అంతెత్తున లేపి కూర్చోబెడుతున్నారు. అందుకే సినిమా మొత్తం సిద్ధం చేసి, మరో వారం, పది రోజుల్లో రిలీజ్ అనుకున్నప్పటికీ.. తమన్‌ను సినిమాలోకి తీసుకొస్తున్నారు. మంచి మ్యూజిక్ సంపాదిస్తున్నారు. అయితే తమన్ నుండి కొత్త సంగీతం వస్తోందా అంటే.. ఆ విషయం ఏమో కానీ కాపీ ట్యూన్లు మాత్రం వస్తున్నాయి అని చెప్పొచ్చు.
తమన్ సంగీతం అందించే సినిమాలో పాటలు వింటే… ఇదెక్కడో విన్నట్లు ఉందే అని కచ్చితంగా అనిపిస్తుంది. అంతలా ట్యూన్లను మిక్సీలో వేసి బాగా రుబ్బి వదులుతుంటారు. తాజాగా ‘సర్కారు వారి పాట’ నుండి విడుదలైన ‘మమ మహేషా..’ పాట కూడా ఇదే రియాక్షన్ సంపాదించింది. గతంలో తమన్ ఎన్ని భారీ సినిమాలు చేస్తున్నా సరే.. అతను ఎదుర్కొన్నంత విమర్శలు, ట్రోలింగ్ ఎవరికీ ఎదురు కాలేదు. దానికి కారణం అతను ఒకానొక సమయంలో ఒకే రకమైన ఊకదంపుడు పాటలు చేయడం.
దాంతోపాటు కొన్ని ఇంటర్నేషనల్ పాటల్ని కాపీ కొట్టడం. అలాగే తన ట్యూన్స్‌నే రిపీట్ చేయడం.అయితే ‘అరవింద సమేత’ నుండి తమన్ స్టైల్ మారింది. పాటల్లో కొత్తదనం చూపిస్తూ వస్తున్నారు. నేపథ్య సంగీతం విషయంలోనూ అంతే. ఇటీవల కాలంలో తమన్ బీజీఎంలు బలంగా వినిపిస్తున్నాయి. గత మూణ్నాలుగేళ్ల నుండి మంచి ఫాంలో కొనసాగుతున్నాడు. ఇన్ని మ్యూజికల్ బ్లాక్‌బస్టర్లు ఇస్తున్నా సరే.. అప్పుడప్పుడూ తమన్ పాటలు ట్రోలర్స్‌కు టార్గెట్ అవుతున్నాయి. కారణం తన ట్యూన్లను తనే అనుకరించడం. తాజాగా మరోసారి తమన్ అదే పని చేసి ట్రోలర్లకు చిక్కారు.
‘సర్కారు వారి పాట’ నుండి ‘మ మ మహేషా’ అనే మాస్ సాంగ్ విన్నప్పుడు జనాలకు ట్యూన్ ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తోంది. తమన్ నుండి గతంలో వచ్చిన ‘ఛల్ మోహన రంగా’ సినిమాలోని ‘ఫస్ట్ లుక్కు సోమవారం…’ అంటూ సాగే పాటకు ఈ పాట చాలా దగ్గరగా ఉంది అంటున్నారు. ఆ సినిమాలో పాట కొంచెం నెమ్మదిగా, క్లాస్‌గా ఉంటే.. ‘మ మ మహేష్’ సాంగ్ వేగంగా, మాసీగా ఉంది. దీంతో రెండు పాటలను పోలుస్తూ.. ఇంత సిమిలర్ ట్యూన్స్ ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు.