మాస్ సినిమాలకు, యాక్షన్ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎలివేషన్ సీన్లు, యాక్షన్ సీన్లకు ఓ లెవల్ హైలో ఉండాలి సంగీతం. ఈ విషయంలో అదరగొట్టేస్తున్న సంగీత దర్శకుల్లో తమన్ (S.S.Thaman), అనిరుథ్ (Anirudh Ravichander) పేర్లు వినిపిస్తాయి సౌత్‌లో. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరే మన దగ్గర ఎలివేషన్ కింగ్‌లు అని చెప్పొచ్చు. రీసెంట్‌గా వచ్చిన సినిమాల్లోనూ ఇద్దరూ తమదైన మార్కు చూపించారు కూడా. అయితే ఆ ఎలివేషన్ మ్యూజిక్ అందరు హీరోలకు నప్పదు. అలా బాగా నప్పేవారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు.
ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అంటే.. 2023 సంక్రాంతికి వచ్చి భారీ విజయం అందుకున్న ‘వీరసింహారెడ్డి’ ( Veera Simha Reddy) సినిమా కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది అని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) మరోసారి బాలకృష్ణతో (Nandamuri Balakrishna) సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘అఖండ 2’ తర్వాత ఈ సినిమానే ఉంటుంది అని చెబుతున్నారు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని టాక్. అయితే, ఇంకా ఎలాంటి పక్కా సమాచారం లేని ఈ సినిమాకు సంబంధించిన ఓ పుకారు వైరల్‌గా మారింది.
గత కొన్ని సినిమాలుగా సంగీత దర్శకుడు తమన్‌ను నమ్ముకున్న బాలయ్య, గోపీచంద్ ఈసారి వేరే మ్యూజిక్ డైరక్టర్ దగ్గరకు వెళ్తున్నారు అని ఆ పుకార్ల సారాంశం. తమిళనాట తన ఆర్‌ఆర్‌లతో అలరిస్తున్న అనిరుథ్ రవిచందర్‌ను ఎలివేషన్ మ్యూజిక్‌ను బాలయ్యకు ఇవ్వాలని గోపీచంద్ అనుకుంటున్నారట. ‘జైలర్’ (Jailer), ‘జైలర్ 2’, ‘విక్రమ్’ (Vikram) , ‘బీస్ట్’ (Beast).. ఇలా ఒక్కటేంటి ఎన్నో సినిమాలు అనిరుథ్ వల్ల బాగా హైప్ సంపాదించాయి. ఇప్పుడు ఆ నమ్మకంతోనే అనిరుథ్‌వైపు గోపీచంద్ చూస్తున్నారని టాక్.
అయితే, తెలుగులో ఎలివేషన్ మ్యూజిక్‌కి పర్యాయపదంగా ఇన్నాళ్లూ ఉన్న తమన్‌ను బాలయ్య వదిలేస్తాడా? ఈ కాంబినేషన్‌ను తెంచేస్తారా అంటే కష్టమే అని చెప్పాలి. చూద్దాం సన్నీ డియోల్ (Sunny Deol) ‘జాట్’ (Jaat) సినిమా ప్రమోషన్స్ కోసం గోపీచంద్ మలినేని బయటకు వస్తారు కదా అప్పుడు తెలుస్తుంది లెండి.