టెక్నాలజీ రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. వినియోగంలో ఏమాత్రం తేడాకొట్టినా అసలుకే మోసం వచ్చేస్తుంది. దీనికి లేటెస్ట్ ఉదాహరణలు కావాలి అంటే ‘ఆచార్య’ (Aharya) , ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమాల పేర్లు చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల్లో లేటెస్ట్ టెక్నాలజీ చాలా జాగ్రత్తగా వాడాం అని చెప్పుకున్న టీమ్… విడుదలయ్యాక ట్రోలింగ్‌కి గురైంది. దీంతో తల బొప్పి కట్టింది అని చెప్పాలి. అయితే, ఇప్పుడు ‘ది గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) (The GOAT) సినిమా టీమ్ కూడా ఇలాంటి పరిస్థితికి దగ్గరగా ఉంది.
మొన్నీమధ్య వచ్చిన ఆ సినిమా ట్రైలర్ విషయంలో పెదవి విరుపులు చాలానే కనిపిస్తున్నాయి, ట్రోలింగ్‌లు కనిపిస్తున్నాయి, విసుర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ టెక్నాలజీ వినియోగం గురించి సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu) కీలక వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గోట్’ (The Greatest of All Time ) . ‘లియో’ (LEO) తర్వాత విజయ్ నటించిన చిత్రం కావడం, ఆయన త్వరలో రాజకీయాల్లోకి వెళ్లనుండటం తదితర కారణాల వల్ల ఈ సినిమా మీద భారీ హైప్ ఉంటుంది.
ఇద్దరు విజయ్‌లు కనిపించడం, దివంగత విజయ్ కాంత్ ఏఐ రూపంలో కనిపించనుండటం మరికొన్ని కారణాలు. డీఏజింగ్ టెక్నాలజీ ద్వారా విజయ్‌ను ఈ సినిమాలో ఓ పాత్ర కోసం యంగ్‌గా చూపిస్తాం అని ఇప్పటికే టీమ్ చెప్పేసింది. ప్రచార చిత్రాల్లో చూపించింది కూడా. ఆ సన్నివేశాల కోసం విజయ్ స్పోర్స్ట్ బేస్డ్ యాక్షన్ మూవీ ‘బిగిల్’లోని సన్నివేశాలను తీసుకున్నామని దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పారు. అయితే ఆ సినిమానే ఎందుకు అనే విషయం మాత్రం చెప్పలేదు.
ఈ నేపథ్యంలో ‘బిగిల్’ (Bigil) కాకుండా వేరే పాత సినిమా ఏదైనా తీసుకొని ఉంటే బాగుండేది అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి స్పందనను చూరగొంటుందో చూడాలి.