ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యువ హీరోల్లో శర్వానంద్ స్థానం ప్రత్యేకం అనే చెప్పాలి. సినిమాపై ఉన్న ఆసక్తి, సినిమా ప్రపంచంలో ఎదగాలి అన్న ఆలోచనా శక్తి ఈ కుర్ర హీరోను ఆ స్థాయికి చేర్చాయి. కమర్షియల్ ఫార్మాట్ కాలంలో బ్రతుకుతున్న సినీ పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలకు సైతం వెనకాడకుండా రన్ రాజా రన్ అంటూ…ఎక్స్‌ప్రెస్ లాగా దూసుకుపోతున్నాడు ఈ ఎక్స్‌ప్రెస్ రాజా. అయితే తన ‘గమ్యం’ సరికొత్త సినిమా అంటున్న ఈ యువ కధానాయకుడు “బ్రతకాలంటే బలుపుండాలి” అన్న దూకుడు తో ‘కో అంటే కోటి’ అన్న సినిమాను సైతం నిర్మించాడు. ఒడిదుడుకులు ఎన్నున్నా సినిమా తన ప్రాణం అంటూ ‘రాజు’గా…’మహారాజు’గా యువ కధానాయకుడిగా సంచలన హిట్స్ కొడుతున్న మన శర్వానంద్ తన కెరియర్ లో చేసిన సరికొత్త పాత్రలు, ప్రయోగాలపై ఒక లుక్ వేద్దాం రండి.
1.గమ్యం
ఈ సినిమా శర్వానంద్ సినీ జీవితంలో ఒక మైలు రాయి అనే చెప్పుకోవాలి. కాస్ట్లీ కుర్రాడిగా, అల్లరి నరేశ్ తో కలసి సాగించిన ప్రయాణంలో జీవిత సత్యాన్ని తెలుసుకుంటాడు. అయితే ఇంతటి సున్నితమైన పాత్రని తనదైన శైలిలో నటించి మెప్పించాడు ఈ యంగ్ హీరో.
2.అమ్మ చెప్పింది
ఈ చిత్రంలో మెచ్యూరిటి లేని ఎదిగిన పిల్లడిగా శర్వానంద్ నటన అమోఘం, అద్భుతం. బహుశా ఆ పాత్రలో ఈ యువ హీరో తప్పితే మరెవరో చెయ్యలేరేమో అన్నంత జీవించాడు. అంతేకాకుండా కెరియర్ తొలి దశలో ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు చెయ్యడం అంటే నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.
3.ప్రస్థానం
శర్వానంద్ లో క్లాస్ హీరోనే కాదు, మాస్ హీరో కూడా ఉన్నాడు అని నిరూపించుకున్న పాత్ర. పొలిటికల్ లీడర్ కొడుకుగా, యూత్ లీడర్ గా, సొంత కుటుంబాన్ని చంపిన సొంత తమ్ముడిపై పగ తీర్చునే పాత్రలో శర్వానంద్ నటించాడు అనడం కన్నా, జీవించాడు అంటే అతిశయోక్తి కాదేమో.
4.కోఅంటే కోటి
హీరోగానే కాకుండా, నిర్మాతగా సైతం శర్వానంద్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా ‘కోఅంటే కోటి’. ఈ చిత్రంలో నిర్మాతగా మారిన మన యువ హీరో, కమర్షియల్ గా చిత్రం విజయం సాధించక పోయినా మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ‘బ్రతకాలంటే బలుపుండాలి బాబాయ్, అది మనకు చాలా ఉంది’ అన్న డైలాగ్ యూత్ ను కట్టి పడేసింది.
5.సత్య-2
రామ్ గోపాల్ వర్మ సంధించిన మాఫియా మేనియా ఈ సత్య-2. ఓ సామాన్య యువకుడు మాఫియాకు కొత్త నిర్వచనం చెప్పేందుకు చేసే ప్రయత్నమే ఈ చిత్రం. అయితే సామాన్యుడి పాత్రలో ఒదిగి ఉంటేనే, తన టాలెంట్ తో, తన తెలివితేటలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించే పాత్రలో శర్వానంద్ నటన అద్భుతం అనే చెప్పాలి.
6.”ఎక్స్‌ప్రెస్ రాజా”
గర్ల్ ఫ్రెండ్ కుక్క పిల్లతో ముడి పడిన ఈ కధలో శర్వానంద్ పండించిన ఎంటర్‌టేన్‌మెంట్ అంతా ఇంతా కాదు. తన పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షక లోకాన్ని గిలిగింతలు పెట్టించాడు.
7.రన్ రాజా రన్
ఒక అమ్మాయి చేతిలో ప్రేమ అనే పేరుతో మోసపోయిన ఈ కుర్ర హీరో, తన నిజమైన ప్రేమను వెతుక్కునే క్రమంలో ఇంకో అమ్మాయితో ప్రేమలో పడతాడు. లవర్ బాయ్ గా ఈ చిత్రంలో మన హీరో పాత్ర మంచి మార్కులు కొట్టేసింది అనే చెప్పాలి.
8.మళ్లీ మళ్లీ…ఇది రాని రోజు
ఒక పక్క పరుగు పందెం క్రీడాకారుడు పాత్రలో, మరోపక్క లవర్ బోయ్ గా, తాను విడిపోయిన గర్ల్ ఫ్రెండ్ కోసం ఎదురు చూసే ప్రేమికుడిగా అద్భుతంగా నటించాడు శర్వానంద్.
ఇలా సినిమా సినిమాకు, పాత్రల్లో వేరియేషన్ చూపిస్తూ, తనదైన శైలిలో కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలు సైతం చేస్తూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు మన శర్వానంద్.