తెలుగు సినిమా ప్రయోగశాలకు హెడ్ మాస్టర్ అయిన అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం “ది ఘోస్ట్”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా సందర్భంగా నేడు విడుదలైంది. చిరంజీవి-నాగార్జునల సినిమాలు ఒకే పండుగకు విడుదలై చాలా ఏళ్లవుతోంది. మరి “గాడ్ ఫాదర్”తోపాటుగా విడుదలైన “ఘోస్ట్” ఆడియన్స్ ను ఏమేరకు అలరించగలిగిందో చూద్దాం..!!
కథ: 1984లో జరిగిన హిందూ-ముస్లిం గొడవల్లో తల్లిదండ్రులను కోల్పోయి.. తనను కాపాడిన మేజర్ చెంతన చేరి పెరుగుతాడు విక్రమ్ (నాగార్జున). మేజర్ కూతురు అనుపమ (గుల్ పనాగ్)ను తన సొంత కుటుంబంలా భావించినా.. ఆమె వేరే పెళ్లి చేసుకొని ఇంటి నుండి బయటకు వెళ్లిపోతుంది.
సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అను తన తమ్ముడు విక్రమ్ ను కాంటాక్ట్ అవుతుంది. తనను, తన కూతురు అదితి (అనికా సురేంద్రన్)ను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని, ఇద్దరినీ కాపాడాలని కోరుతుంది.
ఊటీ చేరుకున్న విక్రమ్.. అనుపమ & అదితికి ఉన్న శత్రువులేవరో ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు. ఈలోపే అనుపమ & అదితిపై స్కార్పియన్ గ్యాంగ్ ఎటాక్ చేస్తారు.
అసలు స్కార్పియన్ గ్యాంగ్ ఎవరు? అనుపమను ఎందుకు ఎటాక్ చేశారు? వాళ్ళ బారి నుండి అనుపమ & అదితిని కాపాడడానికి విక్రమ్ ఏం చేశాడు? అనేది “ది ఘోస్ట్” కథ.
నటీనటుల పనితీరు: విక్రమ్ పాత్రలో 63 ఏళ్ల నాగార్జున.. 40 ఏళ్ల వ్యక్తిగా భలే ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ లో నాగ్ స్క్రీన్ ప్రెజన్స్ భలే ఉంది. నాగార్జునకు ఈ తరహా పాత్రలు కొత్త కాదు. ఆయన క్యారెక్టరైజేషన్ కొన్ని హాలీవుడ్ సినిమాలను తలపించడమే కాక, కొత్తదనం కొదరవడింది. ఇలాంటి నాగార్జునను ఇప్పటికే చాలాసార్లు చూసేశామ్. హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ అండంతోపాటు యాక్షన్ సీన్స్ తోనూ అలరించింది.
బాలీవుడ్ హీరోయిన్ గుల్ పనాగ్, బాలీవుడ్ సీరియల్ యాక్టర్స్ కొందరు విలన్లుగా పర్వాలేదనిపించుకున్నారు. రవివర్మను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు.
సాంకేతికవర్గం పనితీరు: మార్క్ కె.రాబిన్ నేపధ్య సంగీతం బాగుంది. యాక్షన్ సీన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు. అలాగే.. ముఖేష్.జి సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. యాక్షన్ బ్లాక్స్ ను తెరకెక్కించిన విధానం మంచి కిక్ ఇచ్చింది. తెలుగులో ఈ తరహా బ్లడీ యాక్షన్ బ్లాక్స్ చూడడం చాలా అరుదు. ఆ విషయంలో దర్శకుడు కాస్త రిస్క్ చేశాడనే చెప్పాలి.
యాక్షన్ బ్లాక్స్ విషయంలో మంచి రిస్క్ తీసుకున్న ప్రవీణ్ సత్తారు.. స్క్రీన్ ప్లే పరంగా మాత్రం ఎలాంటి కొత్తదనం లేకుండా చాలా సాదాసీదాగా “ది ఘోస్ట్” కథను రాసుకోవడం విస్మయానికి గురి చేసిన విషయం. నిజానికి ప్రవీణ్ మంచి సత్తా ఉన్న దర్శకుడు. సినిమా టీజర్ & ట్రైలర్ తో మంచి అంచనాలను క్రియేట్ చేయగలిగాడు. హాలీవుడ్ చిత్రాలు “మ్యాన్ ఆన్ ఫైర్, జాన్ విక్”ల నుంచి భారీ స్థాయిలో ఇన్స్పిరేషన్ తీసుకుని కూడా.. ఘోస్ట్ క్యారెక్టర్ కు సరైన ఎలివేషన్స్ ను క్రియేట్ చేయలేకపోయాడు. అలాగే.. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పండలేదు. అందువల్ల ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అవ్వలేక, సినిమాతో కనెక్ట్ కాలేక థియేటర్ నుండి బయటకు వెళ్ళేప్పుడు నిరాశతో, అసంతృప్తితో వెనుదిరుగుతాడు. దర్శకుడిగా బొటాబోటి మార్కులతో పాసైన ప్రవీణ్.. కథకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు.
విశ్లేషణ: ప్రస్తుత ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తున్నారు. అది యాక్షన్ సీన్స్ & టైటిల్ విషయంలో మాత్రమే కాదు.. క్యారెక్టరైజేషన్ & స్క్రీన్ ప్లే విషయంలో కూడా. ఈ విషయం ప్రవీణ్ సత్తారు పట్టించుకోకపోవడం గమనార్హం. నిజానికి “ది ఘోస్ట్”కి మంచి యాక్షన్ సినిమాగా, మాస్ ఆడియన్స్ & యాక్షన్ మూవీ లవర్స్ ను అలరించగలిగే మంచి స్కోప్ ఉంది. అయితే.. ఎలివేషన్స్ & ఎమోషన్స్ అనుకున్నంతగా వర్కవుటవ్వకపోవడంతో, ఓ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.
రేటింగ్: 2.5/5