ఓటీటీలను కంట్రోల్ చేస్తాం అంటూ ఓ పక్క నిర్మాతలు బడాయిలు పోతుంటే.. మరోపక్క ఓటీటీలు మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నాయి. ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి రావడం మానేశారు. ఓ నలుగురున్న కుటుంబం థియేటర్ కి వెళ్లాలంటే.. ట్రావెలింగ్, టికెట్స్, పాప్ కార్న్ అన్నీ కలుపుకొని దాదాపుగా రెండు వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది. అదే ఒక నెల ఆగితే ఇంట్లోనే హ్యాపీగా ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్ చేసుకొని మరీ సినిమా చూడొచ్చు.
The Greatest of All Time OTT:
నిన్నమొన్నటివరకు చిన్న సినిమాలు మరియు మీడియం బడ్జెట్ సినిమాలను మాత్రమే కంట్రోల్ చేస్తూ వచ్చిన ఓటీటీ సంస్థలు, ఇప్పుడు స్టార్ హీరోల బడా బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలను కూడా కంట్రోల్ చేయడం మొదలెట్టాయి. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన “గోట్” (The Greatest of All Time ) కనీసం 30 రోజులు కూడా పూర్తవ్వకముందే నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షం కానుంది.
అక్టోబర్ 3న “గోట్” సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తున్నట్లుగా సమస్త ప్రకటించింది. అంటే.. సినిమా థియేటర్లలో విడుదలైన 28 రోజులకు ఓటీటీ విడుదల ప్రకటించడం అనేది థియేట్రికల్ బిజినెస్ కి కచ్చితంగా దెబ్బ. ఈ విషయాన్ని సెట్ చేయడానికి గత కొన్నాళ్లుగా బడా నిర్మాతలు ఓటీటీ సంస్థలతో చర్చలు సాగిస్తున్నారు. తొలుత నిర్మాతలు ఏం చెప్పినా సరే అన్న ఓటీటీ సంస్థలు..
ఇప్పుడు మాత్రం తాము చెప్పిన మాట ప్రకారమే చేయాలి అని మొండిపట్టు పడుతున్నాయట. మరి ఈ ఓటీటీ డేంజర్ బారినుండి సినిమాలను రక్షించుకోవాలి అంటే.. ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే సొమ్మును మెయిన్ ఇన్వెస్ట్మెంట్ లా కాకుండా కేవలం బోనస్ గా భావించగలిగినప్పుడే సాధ్యపడుతుంది. లేదంటే థియేటర్లకు ప్రేక్షకులు దూరమై కొన్నాళ్లకి కేవలం తొలి వారాంతంలో మాత్రమే సినిమాలు థియేటర్లలో ఆడే రోజులకు ఎక్కువ దూరం లేదు.