‘ది రాజాసాబ్'(The RajaSaab) సినిమా మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ మూవీ లవర్స్, మాస్ ఆడియన్స్ కూడా టికెట్ల కోసం పడిగాపులు కాయడం చూశాం. అయితే ఈ సినిమా చూశాక చాలా మంది మిక్స్డ్ టాక్ చెబుతున్నారు.
అలా డివైడ్ టాక్ రావడానికి కొన్ని మైనస్సులు ఉన్నాయి. వాటితో పాటు ప్లస్ పాయింట్స్ ను కూడా ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం
చాలా కాలం తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో స్లిమ్ గా.. యాక్టివ్ గా.. కనిపించాడు. అతని కామెడీ టైమింగ్ ‘ఈశ్వర్’ ‘బుజ్జిగాడు’ నాటి రోజులను గుర్తుచేస్తుంది.ప్రభాస్ సినిమాల్లో యాక్షన్ సీన్ల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని ఏముంది.అవి ఓవర్ ది టాప్ ఉన్నప్పటికీ…ప్రభాస్ కటౌట్ కి అవి సెట్ అయిపోతాయి. మొసలి ఫైట్ సీక్వెన్స్ ఇందుకు పెద్ద ఉదాహరణ. కానీ నటుడిగా ‘ది రాజాసాబ్’ తో ప్రభాస్ మరో మెట్టు పైకి ఎదిగాడు అని చెప్పాలి.హాస్పిటల్ సీన్లో ప్రభాస్ చేసిన నటన.. అతని 24 ఏళ్ళ సినీ కెరీర్లో ‘ది బెస్ట్’ అని చెప్పొచ్చు. తన స్టార్ డమ్ ని పక్కన పెట్టేసి ఆ సీన్లో జీవించేశాడు.
నానమ్మ పాత్ర చేసిన జరీనా వాహాబ్ కూడా చాలా బాగా చేశారు. ఆమె పాత్రతో అందరూ కనెక్ట్ అవుతారు. ‘సొంత నానమ్మకి ఏదో జరిగిపోతుంది’ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.అంతలా ఆమె ఆ పాత్రకి జీవం పోశారు. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది.
దర్శకుడు మారుతీ తన 14 ఏళ్ళ కెరీర్లో ఇంత మంచి కథతో ఒక్క సినిమా కూడా చేయలేదు. ‘ది రాజాసాబ్’ కథ పరంగా చాలా గొప్పది. మారుతీ ట్రాక్ రికార్డుతో, ఫామ్ తో సంబంధం లేకుండా ప్రభాస్ ఈ ప్రాజెక్టు ఓకే చేయడానికి ముఖ్య కారణం అదే. అందులో ఎలాంటి సందేహం లేదు.
‘రెబల్ సాబ్’ పాట కానీ ‘సహానా’ ‘నాచే నాచే’ వంటి పాటల్ని బాగా పిక్చరైజ్ చేశారు.
సెకండాఫ్ లో వచ్చే హాస్పిటల్ సీన్ ని చాలా బాగా రాసుకున్నాడు మారుతీ. ఆ సీన్లో ప్రభాస్ నుండి మ్యాగ్జిమమ్ పెర్ఫార్మన్స్ రాబట్టాడు.
మొసలి ఫైట్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి కచ్చితంగా ఫీస్ట్ ఇస్తుంది. ప్రభాస్ కటౌట్ కి మాత్రమే మ్యాచ్ అయ్యే ఎపిసోడ్ ఇది.
ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకుందాం
‘ది రాజాసాబ్’ లో ఏవైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో.. వాటికి కొనసాగింపుగా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి అని చెప్పాలి.
పాటల పిక్చరైజేషన్ బాగుంది. కానీ ఈ కథకి అడ్డుపడింది పాటలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. పైగా కథ మూడ్ కి అవి బాగా అడ్డుపడ్డాయి. సహానా పాట అయితే ఫస్ట్ హాఫ్ లోనే కాదు.. సెకండాఫ్ లో కూడా ఉంది.
ఇంత మంచి కథ రాసుకున్న దర్శకుడు మారుతీ.. ఆసక్తికర స్క్రీన్ ప్లేని రాసుకోవడంలో విఫలమయ్యాడు. 3 ఏళ్ళు టైం తీసుకున్నప్పుడు.. పేపర్ పై ఇంకాస్త వర్కౌట్ చేయాల్సింది.
టీజర్లో, ట్రైలర్స్ లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ తో కొన్ని విజువల్స్ చూపించారు. కానీ అవి సినిమాలో లేవు. సెకండ్ ట్రైలర్ తో సినిమాకి మంచి బజ్ వచ్చింది. అందుకు కారణం.. ప్రభాస్ వేసిన జోకర్ గెటప్. కానీ దాన్ని సెకండ్ పార్ట్ లీడ్ కోసం వాడారు. అది ఆడియన్స్ కి చాలా చిరాకు తెప్పించింది.
పైగా సెకండ్ పార్ట్ టైటిల్ ‘ది రాజాసాబ్ సర్కస్’ అని పెట్టడం ఇంకా ఇరిటేట్ చేసింది.
తమన్ ఈ సినిమాకి సరైన ఔట్పుట్ ఇవ్వలేకపోయాడు. ఈ విషయంలో కూడా దర్శకుడికే బ్లేమ్ వెళ్లొచ్చు. అలాగే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి తప్ప పాన్ ఇండియా సినిమాలకి తమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదు. ఈ విషయాన్ని మేకర్స్ కూడా గమనిస్తే బెటర్.