ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వకీల్ సాబ్ రిలీజ్ కు ఒక్కరోజు ముందు కొత్త జీవోను అమలులోకి తీసుకురావడంతో పాటు వకీల్ సాబ్ టికెట్ రేట్లకు సంబంధించి ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో తాజాగా జీవోలో మార్పులు చేసినా పవన్ భవిష్యత్తు సినిమాలకు కూడా ఇబ్బందులు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే జగన్ హర్ట్ కావడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తనకు పాల ఫ్యాక్టరీలు లేవని, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవని కామెంట్లు చేశారు. పవన్ చేసిన ఈ కామెంట్ల వల్లే జగన్ హర్ట్ అయ్యారని తెలుస్తోంది. సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ విమర్శలు చేయడంతో జగన్ పవన్ సినిమాలపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్నారు.
ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. పవన్ తరువాత సినిమాల విషయంలో కూడా జగన్ కఠినంగా వ్యవహరిస్తే పవన్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. వకీల్ సాబ్ సినిమాకు టికెట్ రేట్లను భారీగా తగ్గించడం వల్ల ఏపీలోని పలు ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. జగన్ కు పవన్ పై కోపం వచ్చిందని ప్రచారం జరుగుతుండగా మిగతా టాలీవుడ్ హీరోల సినిమాల విషయంలో జగన్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.