సినిమా ఇండస్ట్రీలో ఒకోసారి కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి.. దర్శక నిర్మాతలు కావాలనే బిజినెస్ గురించి చేస్తారో.. లేదా కామెడీగా చేస్తారో లేదో తెలియదు కానీ భలే గమ్మత్తైన చిత్రాలు చోటుచేసుకుంటుంటాయి.. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం అనేది సర్వ సాధారణమే.. ప్రాంతానికి తగ్గట్టు కథలో సోల్ మిస్ కాకుండా చిన్న చిన్న మార్పులతో రీమేక్ చేయగా సూపర్ హిట్స్ అయిన శాతమే ఎక్కువ..
అయితే కొన్నిసార్లు రిజల్ట్ తేడా కొట్టిన దాఖలాలూ ఉన్నాయి.. ఓ తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేసి.. ఆ తర్వాత అదే తెలుగు సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది?.. అందులోనూ రీమేక్ కంటే కూడా డబ్బింగ్ వెర్షన్ హిట్ అయితే అది మామూలు విషయం కాదు కదా.. చదువుతుంటేనే చిత్రంగా అనిపిస్తోంది కదూ.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. తమిళనాట సూర్య, త్రిష జంటగా.. అమీర్ దర్శకుడిగా పరిచయమైన రొమాంటిక్ కామెడీ ఫిలిం..
‘మౌనం పేసియదే’ (Mounam Pesiyadhe).. అంతకుముందు ‘జోడీ’ తో ఎంట్రీ ఇచ్చిన త్రిషకు కథానాయికగా ఇదే ఫస్ట్ మూవీ.. ఈ డైరెక్టర్ తర్వాత కార్తిని ‘పరుత్తి వీరన్’ తో ఇంట్రడ్యూస్ చేశాడు.. 2002 డిసెంబర్ 13న రిలీజ్ అయిన ‘మౌనం పేసియదే’ తమిళనాట మంచి విజయం సాధించింది.. తెలుగులో ఈవీవీ సత్య నారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్‌ని హీరోగా పెట్టి ‘ఆడంతే.. అదో టైపు..’ పేరుతో రీమేక్ చేశారు..
శివాజీ, అనిత (నువ్వు నేను), సింధు మీనన్ నటించారు.. 2003 ఆగస్టు 30న విడుదల చేస్తే ఇక్కడ తేడా కొట్టేసింది.. హైలెట్ ఏంటంటే.. మూడేళ్ల తర్వాత 2006 లో ‘మౌనం పేసియదే’ ని తెలుగులో ‘కంచు’ పేరుతో డబ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.. యువన శంకర్ రాజా పాటలు ఆకట్టుకున్నాయి.. నేటివిటీ కారణంగా కథలో సోల్ మిస్ కావడంతో తెలుగు రీమేక్ వర్కౌట్ కాలేదు..